గోమర్దాకు కృష్ణ జింకలు.. జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు
ఇటీవల గోమర్దా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి కృష్ణజింకలను తరలించారు. జీవవైవిధ్య పరిరక్షణ చర్యలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమ, వన్యప్రాణి సంరక్షణ కేంద్ర వివరాలు విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థుల జనరల్ నాలెడ్జ్ కోసం అందిస్తున్నాం.
అడవుల్లో అంతరించిపోయిన వన్యప్రాణి జాతులను తిరిగి వాటి సహజ ఆవాసాల్లో ప్రవేశపెట్టడం జీవవైవిధ్య పరిరక్షణలో కీలకమైన చర్య. ఈ దిశగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఐదు దశాబ్దాల క్రితం కనుమరుగైన కృష్ణ జింకలను తిరిగి గోమర్దా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రవేశపెట్టేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బర్నావపారా అభయారణ్యం నుంచి 50 కృష్ణ జింకలను తరలించనున్నారు.
ఎక్కడ ఉంది?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సారన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని సారన్‌గఢ్ ప్రాంతంలో గోమర్దా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. గతంలో ఇది రాయ్‌ఘర్ జిల్లా పరిధిలో ఉండేది. 1975లో దీన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. దీని పరిధిలోని గోమర్దా గ్రామం పేరు మీదుగా ఈ అభయారణ్యానికి ఆ పేరు వచ్చింది.
సుమారు 277.91 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో కొండలు, పీఠభూములు, రాతి నేలలు, బహిరంగ గడ్డి మైదానాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు వ్యవసాయానికి అనువుగా ఉండవు. ఇవి వన్యప్రాణులకు సహజ ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి.
లాత్, మానై నదులు ఈ అభయారణ్యంలోని ప్రధాన నీటి వనరులు. ముఖ్యంగా వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వృక్షజాలం
గోమర్దా ప్రాంతంలో ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు విస్తరించి ఉన్నాయి. సాల్, బిజా, టెండు, సాలై, వెదురు వంటి వృక్షజాతులు ఇక్కడ కనిపిస్తాయి. అడవులతో పాటు గడ్డి మైదానాలు కూడా ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.
జంతుజాలం
ఈ అభయారణ్యం వివిధ రకాల వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. చుక్కల జింకలు (Chital), సాంబార్లు, నీల్గాయ్, గౌర్లు (భారతీయ అడవి దున్నలు), సింగా, బార్కింగ్ డీర్ (ముంట్జాక్), అడవి పందులు, చిరుతపులులు, అడవి కుక్కలు (ధోల్), నక్కలు, హైనాలు, ఎలుగుబంట్లు (Sloth Bears), నెమళ్లు, చిలుకలు, డేగలు, గుడ్లగూబలు, కింగ్‌ఫిషర్ తదితర పశు, పక్షి జాతులు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

Gomarda Wildlife Sanctuary
ఐదు దశాబ్దాల తర్వాత..
వేట, అక్రమ వేట, అటవీ భూముల ఆక్రమణ, అభివృద్ధి కార్యకలాపాలు వంటి కారణాలతో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కృష్ణజింకల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1970 వ దశకం నాటికి గోమర్దా ప్రాంతం లో ఈ జాతి పూర్తిగా కనుమరుగైంది. దీంతో ఐదు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో కృష్ణ జింకల ఉనికి లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో కృష్ణ జింకల పునరుద్ధరణ కోసం ఛత్తీస్‌గఢ్ అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినది. ఇందులో భాగంగా బర్నావపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 50 కృష్ణ జింకలను గోమర్దాకు తరలించేందుకు చర్యలు చేపట్టింది.
గతంలో బర్నావపారాలో చేపట్టిన కృష్ణ జింకల పునరావాస కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. 2017-18లో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ నుంచి 50, బిలాస్‌పూర్‌లోని కానన్ పెండారి జూలాజికల్ గార్డెన్ నుంచి 27 కృష్ణ జింకలను అక్కడికి తరలించారు. ప్రస్తుతం బర్నావపారాలో వీటి సంఖ్య 150కు పైగా పెరిగింది.
గోమర్దాలోనూ అనుకూలమైన గడ్డి మైదానాలు, నీటి వనరులు ఉండటంతో కృష్ణ జింకల పునరావాసానికి ఈ ప్రాంతం అనువైనదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే అభయారణ్యంలోని జీవవైవిధ్యం మరింత మెరుగుపడటంతో పాటు వన్యప్రాణి పర్యాటకానికి, స్థానికులకు ఉపాధి అవకాశాలకు కూడా ప్రోత్సాహం లభించనున్నది.
శాస్త్రీయ నామం
Antilope cervicapra. ఇవి జింక జాతికి చెందినవి కావు. యాంటిలోప్ (Antelope) జాతికి చెందినవి. భారత ఉపఖండానికి చెందిన స్థానిక జాతి. మగ కృష్ణ జింకలకు మెలికలు తిరిగిన పొడవాటి కొమ్ములు ఉంటాయి. బహిరంగ గడ్డి మైదానాలు, పొదలు తక్కువగా ఉండే ప్రాంతాలు వీటి ప్రధాన ఆవాసాలు. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్-I కింద రక్షణ పొందుతున్నాయి.
ఒక ప్రాంతంలో అంతరించి పోయిన జాతిని తిరిగి ప్రవేశపెట్టడాన్ని పునఃప్రవేశం అంటారు. జీవవైవిధ్య పరిరక్షణలో ఇది కీలకమైన విధానం. గోమర్దాలో చేపడుతున్న కృష్ణ జింకల పునరావాస కార్యక్రమం దీనికి ఒక ఉదాహరణ.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోమర్దాకు కృష్ణ జింకలు.. జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు
Sam Altman | ఎంతపెద్ద హీరోలోనైనా లోపాలుంటాయ్.. జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా శామ్ ఆల్ట్‌మన్..!
‘రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలు’
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం
CNG Gas leak | కోనసీమ జిల్లాలో సీఎన్జీ గ్యాస్ లీక్..సమీప ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

