బుధవారం 03 మార్చి 2021
Nipuna-education - Feb 21, 2021 , 02:50:40

పక్కా ప్లాన్‌తో కొలువు గ్యారెంటీ !

పక్కా ప్లాన్‌తో కొలువు గ్యారెంటీ !

కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో గ్రూప్‌ సీ విభాగం కిందకు వచ్చే ఈ ఉద్యోగాల భర్తీకి ఏటా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేస్తుంది. ఈ పోస్టుల భర్తీకి మల్టీ టాస్కింగ్‌ (నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తుంది. కేవలం రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తుంది. కేవలం పదోతరగతి అర్హతతోనే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.16,000-22,000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు ఇస్తారు. ఈ పోస్టులో జాయిన్‌ అయిన తర్వాత పదోన్నతులకు అవకాశం ఉంది.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌

 • దీనిలో నాన్‌వెర్బల్‌ నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌-1లో ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు కేటాయించారు. వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌, క్రిటికల్‌, అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 
 • ఈ విభాగం కేవలం ప్రాథమిక అంశాలపై కొంచెం పట్టు, లాజికల్‌ థింకింగ్‌ ఉంటే కనీసం 15 నుంచి 20 ప్రశ్నల వరకు సమాధానం సులభంగా గుర్తించవచ్చు. 
 • ఈ విభాగంలో పోలికలు, భేదాలు, సమస్య సాధన, జడ్జిమెంట్‌, నిర్ణయం తీసుకోవడం, ఫిగర్‌ క్లాసిఫికేషన్‌, నంబర్లు, లెటర్లు, పదాలు, చిత్రాలమీద ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. సిరీస్‌, అనాలజీ, ఆడ్‌మాన్‌ అవుట్‌, చిత్రాన్ని పూర్తిచేయడం, మిర్రర్‌ ఇమేజ్‌, వాటర్‌ ఇమేజ్‌ నుంచి 10 ప్రశ్నలకుపైగా వస్తాయి. సిలాజిసం, స్టేట్‌మెంట్‌- కన్‌క్లూజన్‌, స్టేట్‌మెంట్‌- అసంప్షన్‌ల నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. పజిల్స్‌, రక్తసంబంధాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, గ్రూప్‌గా వచ్చే ప్రశ్నల నుంచి 10 ప్రశ్నల సమాధానం గుర్తించవచ్చు. కేవలం ప్రాక్టీస్‌ పైనే ఈ విభాగం ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ మాదిరి ప్రశ్నలను, ప్రీవియస్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేస్తారో వారు తప్పక 50 మార్కులు సాధిస్తారు. గత పరీక్షల్లో పరిశీలిస్తే చాలామంది 50 మార్కులు సాధించారు.

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌

 • ఈ విభాగంలో కొంత సాధన చేస్తే సులభంగా పూర్తిస్థాయి మార్కులు సాధించవచ్చు. దీనిలో అర్థమెటిక్‌, మ్యాథ్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు అర్థమెటిక్‌ నుంచే వస్తాయి. వీటిలో పూర్ణసంఖ్యలు, దశాంశాలు, భిన్నాలు, నిష్పత్తి, అనుపాతం, సగటు, వడ్డీ, లాభం, నష్టం, డిస్కౌంట్‌, టేబుల్స్‌, గ్రాఫ్స్‌, క్షేత్రమితి, కాలం-దూరం, నిష్పత్తి-దూరం, కాలం-పని తదితర అంశాలపై పశ్నలు ఇస్తారు.
 • ఇవన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. వీటిపై కొంత కష్టపడితే సులభంగా మార్కులు సాధించవచ్చు. వీటికోసం ఆరు నుంచి పదోతరగతి వరకు మ్యాథ్స్‌ పుస్తకాలను ఒకసారి తిరగేస్తే మంచిది. ఫార్ములాలను బాగా గుర్తుంచుకోవాలి. 
 • ప్రీవియస్‌ ఇయర్స్‌లో వచ్చిన ప్రశ్నలను ఒకసారి గమనించి వాటి ప్రకారం ప్రిపరేషన్‌ కొనసాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. 
 • అదేవిధంగా డేటా అనాలిసిస్‌, డేటా ఇంటర్‌ప్రిటేషనల నుంచి అడుగుతారు. 3-5 ప్రశ్నలు వీటి నుంచి ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా బూలియన్‌ ఆపరేషన్స్‌పై పట్టు పెంచుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. సులభంగా, వేగంగా, కచ్చితత్వంతో లెక్కలు చేయడం ప్రాక్టీస్‌ ద్వారానే సాధ్యమవుతుంది. ఎక్కువ షార్ట్‌కట్స్‌ చేస్తే అసలుకే మోసం వస్తుంది. కాన్సెప్ట్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌తో వేగంగా జవాబులు గుర్తించడం వల్ల మంచి స్కోర్‌ సాధించవచ్చు.

పేపర్‌-2: ఈ పేపర్‌ కేవలం అర్హత పరీక్ష అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో దీనిలో అర్హత సాధించక వెనుతిరుగాల్సి వస్తుంది. అంతేకాదు పేపర్‌-1లో మార్కులు సమానమైనప్పుడు ఇది చాలా కీలకం. 

పేపర్‌-1 పరీక్ష అయిపోయిన తర్వాత సుమారు మూడునెలల సమయం ఉంటుంది. కాబట్టి చాలా కూల్‌గా ఈ పేపర్‌కు ప్రిపేర్‌ కావచ్చు.

ఈ పేపర్‌ను తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూతో పాటు రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా ఈ పరీక్ష రాసుకునే వీలుంది. ఇందులో ప్రధానంగా ఎస్సే, లెటర్‌ రైటింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. అక్షరదోషాలు, పద ప్రయోగాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. వాక్య నిర్మాణం, విరామ చిహ్నాల వినియోగంపై శ్రద్ధ వహించాలి. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

గుర్తుంచుకోవాల్సిన కీలకాంశాలు

 • సిలబస్‌ ఆధారంగా ప్రిపరేషన్‌ చేయాలి
 • ప్రీవియస్‌ పేపర్స్‌ పరిశీలన, విశ్లేషణ చేసుకున్న తర్వాతనే ప్రిపరేషన్‌ ప్రారంభించడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. 
 • ఎగ్జామ్‌లో ఒక స్ట్రాటజీని ఫాలో కావాలి. అభ్యర్థుల బలాలు, బలహీనతలు ఆధారంగా పరీక్ష ప్లాన్‌ ఉండాలి.
 • ఏ సబ్జెక్టు సులభమో ఆ సబ్జెక్టు నుంచి పరీక్ష రాయడం మొదలు పెట్టాలి. 
 • ప్రశ్నకి సమాధానం తెలియకపోయినా, మీకు వచ్చిన జవాబు ఇచ్చిన ఆప్షన్లలో లేకపోయినా, ప్రశ్న చదివినప్పుడు అర్థం కాకపోయినా, ఆయా ప్రశ్నలను విడిచి వేరే ప్రశ్నను ఎంచుకోవాలి.
 • ఒకే సెక్షన్‌ లేదా ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయవద్దు.
 • ప్రాక్టీస్‌కు మించిన షార్ట్‌కట్‌ మరొకటి లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
 • కాన్సెప్ట్‌ బేస్డ్‌ ప్రిపరేషన్‌, సొంతనోట్స్‌ రాసుకోవడం, కచ్చితమైన ప్రణాళిక ప్రకారం చదవడం విజయానికి మార్గాలు.
 • ఎటువంటి అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయకుండా నేటి నుంచే ప్రిపరేషన్‌ మొదలు పెడితే సులభంగా కేంద్ర కొలువును సాధించవచ్చు.

 జనరల్‌ అవేర్‌నెస్‌

 • ఇది విస్తృతమైన విభాగం కానీ కొంత శ్రద్ధపెడితే దీనిలో పట్టు సులభంగా సాధించవచ్చు. నిత్యం మన చుట్టూ ఏం జరుగుతుంది, ప్రపంచంలో సమకాలీన అంశాలు వాటి పూర్వోత్తరాలను తెలుసుకుంటుంటే చాలు.
 • జాగ్రఫీ, చరిత్ర, ఆర్థిక సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి. సెంట్రల్‌ గవర్నమెంట్‌ పథకాలు, బడ్జెట్‌, ఇటీవల జరిగిన సదస్సులు, సమావేశాలు వాటి ప్రధాన, వాటి ముఖ్యాంశాలు, ఆయాదేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, యునెస్కో గుర్తించిన ప్రదేశాలపై పట్టు పెంచుకోవాలి. పొడవైన/లోతైన/ ఎత్తయిన నదులు, పర్వతాలు, వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్‌ సంబంధిత అంశాల్లో ప్రస్తుతం జరిగిన ఆటల్లో విజేతలు, పుస్తక రచయితలు, కరోనా వైరస్‌, బ్యాక్టీరియా, కెమికల్‌ ఫార్ములాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, భారత్‌ ప్రయోగించిన అంతరిక్ష ప్రయోగాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బార్డర్స్‌, ఆయా దేశాలతో భారత్‌కు ఉన్న సరిహద్దు ప్రాంతాలపై అవగాహన ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు. దీనికోసం ప్రతిరోజూ తప్పనిసరిగా దినపత్రికలు చదవడం, నమస్తే తెలంగాణ ‘నిపుణ’ చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.

ఎవరు అర్హులు ?

 • గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత. 
 • వయస్సు: 2021, జనవరి 1 నాటికి 18 నుంచి 25/27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 

పేపర్‌-1

 • కంప్యూటర్‌ ఆధారితంగా 100 మార్కులకు ఉంటుంది. 
 • ఇందులో నాలుగు సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు అడుగుతారు. 
 • దీనిలో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌-25, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌-25, జనరల్‌ అవేర్‌నెస్‌- 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు.
 • ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 
 • నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 
 • పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. 
 • పేపర్‌-1లో నిర్ణీత అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్‌-2రాయాలి. 

పేపర్‌-2

 • దీనిని డిస్క్రిప్టివ్‌ పద్ధతి (పెన్ను, పేపర్‌)లో నిర్వహిస్తారు. 
 •  50 మార్కులకు ఉంటుంది. 
 • పరీక్షా సమయం 30 నిమిషాలు. 
 • పేపర్‌-2 కేవలం క్వాలిఫయింగ్‌ నేచర్‌ పరీక్ష మాత్రమే. దీనిలో అన్‌రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు 40 శాతం, రిజర్వ్‌డ్‌ కేటగిరీ వారికి 35 శాతం మార్కులను కటాఫ్‌గా  నిర్ణయించారు. తుది ఎంపిక పేపర్‌-1లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి, ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. 
 • పరీక్షలో ముఖ్యంగా జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నలు అడుగుతారు. 

జనరల్‌ ఇంగ్లిష్‌ 

 • సుమారు నాలుగున్నర నెలల సమయం ఉంది. ఈ సమయాన్ని ప్రణాళికబద్ధంగా ఉపయోగించుకోవాలి. 
 • ఇంగ్లిష్‌లో ప్రాథమిక అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పదోతరగతి స్థాయిలో గ్రామర్‌పై పట్టు సాధించాలి. గ్రామర్‌ నియమాలు తెలిస్తే 40 నుంచి 50 శాతం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఇంగ్లిష్‌ నుంచి ఒకాబులరీ, సెంటెన్స్‌ స్ట్రక్చర్‌, సినానిమ్స్‌, యాంటానిమ్స్‌, ఎర్రర్‌ లొకేషన్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌ ప్రశ్నలు ఈ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఒకాబులరీ, యాంటినిమ్స్‌, సినానిమ్స్‌ నుంచి 10 ప్రశ్నల వరకు వస్తున్నాయి. దీనిలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎక్కువ ప్రాక్టీస్‌ ప్రశ్నలను చేయాలి. దీనికోసం తక్కువ సమయంలో ఇచ్చిన సమాచారాన్ని చదివి, అందులో ముఖ్యమైన లేదా అవసరమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడం. కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌లో సులభంగా జవాబులు గుర్తుంచుకోవాలంటే మొదట ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తరువాత ప్యాసేజీలో ఇచ్చిన సమాచారాన్ని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభమవుతుంది. దీనికోసం ప్రతిరోజు ఇంగ్లిష్‌ కోసం కనీసం రెండుగంటలు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక ఇంగ్లిష్‌ దినపత్రిక చదవాలి. ఇందులో ఎడిటోరియల్‌ కాలమ్స్‌, బిజినెస్‌ పేపర్‌, స్పోర్ట్స్‌ పేజీలు చదివితే ఒకాబులరీ, గ్రామర్‌, కరెంట్‌ అఫైర్స్‌తోపాటు ఇంగ్లిష్‌ భాషపై పట్టు వస్తుంది.

మరో ముఖ్యవిషయం గుర్తుంచుకోవాలి. ఇంగ్లిష్‌ సబ్జెక్టు మార్కులు చాలా కీలకం. మెరిట్‌ లిస్ట్‌లో చోటు దక్కాలంటే ఈ విభాగంలోని మార్కులే కీలకం. చాలామందికి దీనిలో తక్కువ మార్కులు వస్తాయి. దీనిపై ప్రత్యేక శ్రద్ధపెడితే తప్పక మంచిమార్కులు సాధించవచ్చు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 21

ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 23

టైర్‌-1 ఎగ్జామ్‌ తేదీ: జూలై 1-20 వరకు నిర్వహిస్తారు.

టైర్‌-2 ఎగ్జామ్‌ తేదీ: నవంబర్‌ 21 

పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in 

VIDEOS

logo