శనివారం 23 జనవరి 2021
Nipuna-education - Jul 15, 2020 , 02:34:39

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

తెలంగాణ

నూతన సెక్రటేరియట్‌

నూతన సెక్రటేరియట్‌ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం జూలై 7న విడుదల చేసింది. ఈ భవనానికి డిజైన్‌ను అందించినది చెన్నైకి చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్స్‌కు చెందిన ఆస్కార్‌ జీ కాన్సెస్సావో, పొన్ని ఎం కాన్సెస్సావో అనే ఇంజినీర్‌ దంపతులు. దక్కన్‌ కాకతీయ శైలిలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 

టీఎస్‌పీ అధ్యక్షుడిగా శివారెడ్డి

చారిత్రక తెలంగాణ సారస్వత పరిషత్తు (టీఎస్‌పీ) అధ్యక్షుడిగా 2020-25కు గాను ప్రముఖ సాహితీవేత్త, తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మరోసారి జూలై 8న ఎన్నికయ్యారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా డా. జుర్రు చెన్నయ్య, ఉపాధ్యక్షులుగా కేవీ రమణాచారి, డా. ముదిగంటి సుజాతారెడ్డి, కోశాధిగారిగా మంత్రి రామారావు, పరీక్ష కార్యదర్శిగా మసన చెన్నప్ప ఎన్నికయ్యారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌

ఐఐటీహెచ్‌, మల్టీ టెక్నాలజీ కంపెనీ ఎన్‌వీడియా సంయుక్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి జూలై 9న తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకే కృత్రిమ మేధ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌వీడియా దక్షిణాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ విశాల్‌ ధూపర్‌ వెల్లడించారు.

జాతీయం

 రైళ్లకు సౌర విద్యుత్‌

మధ్యప్రదేశ్‌లోని బీనా పట్టణంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రైల్వే ఓవర్‌ హెడ్‌ లైన్‌కు సరఫరా చేశారు. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా రైళ్లకు సౌర విద్యుత్‌ను అందించిన ఘనతను భారతీయ రైల్వే సాధించిందని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ జూన్‌ 6న తెలిపారు. రైల్వే శాఖ, బీహెచ్‌ఈఎల్‌ సంయుక్త భాగస్వామ్యంతో బీనాలోని రైల్వే శాఖ స్థలంలో 1.7 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. దీని నుంచి ప్రతి ఏడాది 25 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. 

సంకల్ప్‌ పర్వ్‌

సంకల్ప్‌ పర్వ్‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఢిల్లలోని నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, కిలా రాయ్‌ పిథోరాలో జూలై 8న మొక్కలు నాటారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సంకల్ప్‌ పర్వ్‌ను జూన్‌ 28 నుంచి జూలై 12 వరకు నిర్వహించారు.

వంతెనలు ప్రారంభం

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్ముకశ్మీర్‌లో ఆరు వంతెనలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జూలై 8న ప్రారంభించారు. వీటి నిర్మాణానికి రూ.43 కోట్లు  ఖర్చుచేశారు. అఖ్నూర్‌-పల్లన్‌వాలా రహదారిపై నాలుగు, కథువా జిల్లాలోని తార్నా నల్లాపై రెండు వంతెనలను ప్రారంభించారు. 

ఇండియా గ్లోబల్‌ వీక్‌

భారత్‌లో వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవకాశాలే ప్రధానాంశంగా నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020’ కార్యక్రమం జూలై 9న ప్రారంభమైంది. దీనిలో భాగంగా ‘బీ ది రివైవల్‌: ఇండియా అండ్‌ ఏ బెటర్‌ న్యూ వరల్డ్‌' అనే థీమ్‌తో ఈ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ను లండన్‌లోని India Inc మూడురోజులపాటు నిర్వహించింది. దీనిలో 30 దేశాల నుంచి 5000 మంది పాల్గొన్నారు. 

బ్లూయీస్‌

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌ ల్యాండ్‌ యూజ్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ (బీఎల్‌యూఐఎస్‌-బ్లూయీస్‌)ను జూలై 9న ఆవిష్కరించారు. ఇది అధిక రిజల్యూషన్‌ కలిగిన ఉపగ్రహ చిత్రాలను పెంచడంద్వారా ఒడిశాలోని అన్ని ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.

ఆసియాలోనే అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌

ఆసియాలోనే అతదిపెద్ద సోలార్‌ ప్లాంట్‌ ‘రేవా అల్ట్రా మెగా సోలార్‌ ప్రాజెక్ట్‌'ను ప్రధాని మోదీ జూలై 10న ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. దీనిని మధ్యప్రదేశ్‌లోని రేవాలో 750 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ భారీ విద్యుత్‌ కేంద్రాన్ని మధ్యప్రదేశ్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశాయి. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌ దీని ప్రధాన ఉద్దేశమని మోదీ అన్నారు.

అంతర్జాతీయం

ఒఫెక్‌-16 ఉపగ్రహం

ఒఫెక్‌-16 అనే ఉపగ్రహాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం జూలై 5న విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. అత్యుత్తమ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రో ఆప్టికల్‌ రికన్నైజాన్స్‌ శాటిలైట్‌ ఇది. 

డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలిగినట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి జూలై 8న అధికారికంగా సమాచారం అందించారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వైదొలగడానికి ఒక ఏడాది ముందుగా సమాచారం ఇవ్వాలి. అంటే వచ్చే ఏడాది జూలై 6 తర్వాత అమెరికా సభ్యత్వం రద్దవుతుంది. 

చైనా కమర్షియల్‌ శాటిలైట్‌

చైనా కమర్షియల్‌ శాటిలైట్‌ అప్‌స్టార్‌-6డీని జూలై 10న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. దీని జీవితకాలం 15 ఏండ్లు. బరువు 5,550 కిలోలు. ఈ ఉపగ్రహం వినియోగదారులకు ఆప్టిమైజ్‌ చేసిన అధిక నాణ్యత వాయిస్‌, బ్రాడ్‌బ్యాండ్‌ డాటా సేవలందిస్తుంది.

సింగపూర్‌ ఎన్నికల్లో పీఏపీ విజయం

జూలై 11న విడుదలైన సింగపూర్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని లీ సియెన్‌ లూంగ్‌ (68 ఏండ్లు) ఆధ్వర్యంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) 61.24 శాతం ఓట్లతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకుగాను ఆ పార్టీ 83 చోట్ల గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. 1965లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ పార్టీయే గెలుస్తూ వస్తుంది.

జపాన్‌ బుల్లెట్‌ రైలు

జపాన్‌ దేశం జూలై 7న ప్రవేశపెట్టిన బుల్లెట్‌ రైలు పేరు ఎన్‌700ఎస్‌. ఎస్‌ అంటే సుప్రీం. ఈ రైలు భూకంపాన్ని కూడా తట్టుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 360 కి.మీ. అసలు వేగం గంటకు 285 కి.మీ.

వార్తల్లో వ్యక్తులు

ఐఎఫ్‌ఎస్‌సీఏ చైర్మన్‌గా శ్రీనివాస్‌

ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంజేటి శ్రీనివాస్‌ను కేంద్ర ప్రభుత్వం జూలై 6న నియమించింది. 1983 బ్యాచ్‌ ఒడిశా కేడర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు ఉంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కేంద్రంగా ఐఎఫ్‌ఎస్‌సీఏను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సెక్యూరిటీలు, డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ కాంట్రాక్టులు, ఫైనాన్షియల్‌ సర్వీసులు, ఇదివరకు ఆర్‌బీఐ, సెబీ లాంటి నియంత్రణ సంస్థల ఆమోదం పొంది నడుస్తున్న ఆర్థిక సంస్థలను ఇది నియంత్రిస్తుంది. దీనికి చైర్మన్‌తోపాటు 9 మంది సభ్యులు ఉంటారు.

బఫెట్‌ దాతృత్వం

ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ తన బెర్క్‌షైర్‌ కంపెనీకి చెందిన 2.9 బిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లను బిల్‌-మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌కు జూలై 7న విరాళంగా అందించారు. మొత్తం 5 చారిటీ సంస్థలకు విరాళం ప్రకటించారు. బఫెట్‌ 2006 నుంచి 37 బిలియన్లకు పైగా విరాళాలు అందించారు. ప్రస్తుతం బఫెట్‌ నికర ఆస్థుల విలువ 87 బిలియన్‌ డాలర్లు.

వారెన్‌ బఫెట్‌ను అధిగమించిన ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముకేశ్‌ అంబానీ సంపద విషయంలో పెట్టుబడుల బిలయనీర్‌ వారెన్‌ బఫెట్‌ను అధిగమించారు. జూలై 10న విడుదలైన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ముకేశ్‌ సంపద 68.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5.12 లక్షల కోట్లు)గా నమోదైంది. నాటి బఫెట్‌ సంపద 67.9 బియలిన్‌ డాలర్లతో పోలిస్తే ఇది ఎక్కువ. ప్రపంచంలోనే అగ్రగామి కుబేరుల జాబితాలో 8వ స్థానంలో, బఫెట్‌ 9వ స్థానంలోకి చేరారు. జెఫ్‌ బెజోస్‌ 188 బి.డాలర్లతో అగ్రస్థానంలో, బిలగేట్స్‌ (115 బి.డా) 2, బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ (92.8 బి.డా) 3, మార్క్‌ జుకర్‌బర్గ్‌ (92.7 బి.డా) 4వ స్థానాల్లో ఉన్నారు.

క్రీడలు

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి విజేత బొటాస్‌

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2020 సీజన్‌ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ విజేతగా నిలిచాడు. ఆస్ట్రియాలోని స్పీల్‌బర్గ్‌లో జూలై 5న జరిగిన 71 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్‌ అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరి అగ్రస్థానాన్ని పొందాడు.  

యూటీఆర్‌ ప్రొ టెన్నిస్‌ విజేతగా ప్రాంజల

యూటీఆర్‌ ప్రొ టెన్నిస్‌ సిరీస్‌ టోర్నమెంటులో హైదరాబాదీ యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జూలై 6న జరిగిన ఫైనల్లో 6-3, 6-3తో డబుల్స్‌లో ప్రపంచ ర్యాంకర్‌ డెసిరే క్రాజిక్‌ (అమెరికా)పై గెలిచింది.  

హాకీ ఇండియా అధ్యక్షుడి రాజీనామా

హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌ తన పదవికి జూలై 10న రాజీనామా చేశాడు. జాతీయ క్రీడా నియమావళి పదవీకాల మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడిగా ఎన్నికయినందున వెంటనే వైదొలగాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించిన నేపథ్యంలో అహ్మద్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్ర నిగోంబమ్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది.

  • వేముల సైదులు
  • జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు
  • ఆర్‌సీ రెడ్డి  స్టడీ సర్కిల్‌ ,హైదరాబాద్‌


logo