బంజారాహిల్స్, ఏప్రిల్ 6: ఓ వ్యక్తి ఆదివారం బిర్యానీ కోసం ఆర్డర్ చేస్తే పాచిపోయింది డెలివరీ అయింది. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.1లోని వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం జొమోటోలో బిర్యానీ ఆర్డర్ చేయగా డెలివరీ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా పాచిపోయినట్లు గుర్తించాడు.
దీంతో అది పంపించిన బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ‘లక్కీ బిర్యానీ అండ్ షోర్మా ’వద్దకు వెళ్లి చూడగా కొండారెడ్డి షాక్‌కు గురయ్యాడు. అక్కడ ఓ అపార్ట్మెంట్లోని సెల్లార్లో రెండు భారీ ఫ్రిజ్‌ల్లో బిర్యానీ ప్యాకెట్లు స్టోర్ చేసి ఆన్లైన్ ఆర్డర్ వచ్చిన వెంటనే ఓవెన్లో వేడి చేసి పంపిస్తున్నారని తేలింది.
జీడిమెట్లలో ఇర్ఫాన్ అనే వ్యక్తి బిర్యానీలు చేసి బంజారా హిల్స్‌లో స్టోర్‌చేసి ఆన్లైన్ ద్వారా జొమోటో, స్విగ్గీస్ సంస్థల ద్వారా అమ్ముతున్నారని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించగా సుమారు 80కి పైగా బిర్యానీలు నిల్వ ఉం చినట్లు గుర్తించారు. అపరిశుభ్రకరమైన పరిసరాలతో, ఎలుకలు బొద్దింకలు తిరుగుతున్న ప్రాంతంలో బిర్యానీ ప్యాకెట్లు ఉంచడంతో.. బాధితుడు కొండారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.