e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News మీ కలలే..బలం!

మీ కలలే..బలం!

పెండ్లయితే కలల్ని చిదిమేసుకోవాలా? పిల్లలు పుట్టగానే మన జీవితం మనకే పరాయిదైపోతుందా? బాధ్యతలు పెరిగే కొద్దీ ఆశయాలను వదిలేసుకోవాలా? అవసరం లేదు. నవ యువతిగా సాధించలేనిది గృహిణిగా సాధించవచ్చు. అది అందాల కిరీటం కావచ్చు, ఆంత్రప్రెన్యూర్‌ అన్న హోదా కావచ్చు. మిసెస్‌ ఇండియా రన్నర్‌-అప్‌ ప్రీతిరెడ్డి జీవితమే అందుకు ఉదాహరణ. లక్ష్యం వెంబడి ప్రీతిరెడ్డి సాగించిన ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..

మేం తెలుగు వాళ్లమే అయినా, మా కుటుంబం చాలా ఏండ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడింది. దాంతో నా బాల్యం అక్కడే గడిచిపోయింది. ఎంబీఏ తర్వాత ఓ జర్మన్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. యూరప్‌, సింగపూర్‌, మలేషియా ఆఫీసుల్లో పని చేశాను. నా భర్త సిద్ధార్థ్‌రెడ్డిది హైదరాబాద్‌. దీంతో ఇక్కడే స్థిరపడ్డాం. కుటుంబ బాధ్యతల కారణంగా కొంతకాలం ఉద్యోగానికి బ్రేక్‌ ఇచ్చాను. బాబు పుట్టాక మావారి ప్రోత్సాహంతో వ్యాపారంలోకి అడుగుపెట్టాను. నగర ప్రజలు కుటుంబంతో, మిత్రులతో సరదాగా గడిపేందుకు వీలుగా కూకట్‌పల్లిలోని సుజనా ఫోరమ్‌ మాల్‌లో ‘షెర్లాక్స్‌ లాంజ్‌ అండ్‌ కిచెన్‌’ ప్రారంభించాను. లాక్‌డౌన్‌ సమయంలో కొంత ఇబ్బందిపడినా, ప్రస్తుతం వ్యాపారం ఊపందుకుంది.

- Advertisement -

జ్ఞాపకాలను పోగేస్తూ..
నిజానికి, ‘షెర్లాక్స్‌ లాంజ్‌ అండ్‌ కిచెన్‌’ అనేది మా ఫ్రెండ్‌వాళ్ల బ్రాండ్‌. బెంగళూరులో విజయవంతంగా నడుస్తున్నది. ఆ పేరు మీదే హైదరాబాద్‌కు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. 2019లో అన్ని హంగులతో లాంజ్‌ ప్రారంభించాం. చాలామంది సకుటుంబంగా వచ్చి పుట్టినరోజు, పెండ్లిరోజు పార్టీలు చేసుకుంటారు. కార్పొరేట్‌ మీటింగ్స్‌, కిట్టీ పార్టీలు కూడా మా దగ్గర జరుపుకొంటారు. వేడుకల కోసం మా లాంజ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కొంతమంది ముందే చెప్పి, ఏదైనా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేయమని అడుగుతారు. ఇక్కడ అందమైన జ్ఞాపకాలను సృష్టించుకొంటారు. మా ఫుడ్‌ మెనూలో తెలంగాణ కోడికూర వేపుడు, చేపల వేపుడు సహా అన్ని రుచులూ ఉంటాయి. నా భర్త సిద్ధార్థ్‌ కీసర దగ్గర్లోని హోలీమేరీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌కు చైర్మన్‌. నేను రాత్రిళ్లు ఇంటికెళ్లడం ఆలస్యమైతే, మూడేండ్ల బాబును తనే ఓపిగ్గా చూసుకుంటాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే, మహిళలు ఏ రంగంలో అయినా విజయం సాధించగలరని నా బలమైన నమ్మకం.

‘మిసెస్‌ ఇండియా’గా ..
మధ్య తరగతి గృహిణులకు ఎన్నో ఆశలు ఉంటాయి. వాటిని మనసులోనే దాచుకొని.. కుటుంబ బాధ్యతలతో రోజులు గడుపుతుంటారు. పెండ్లయింది, పిల్లలు పుట్టేశారు, జీవితంలో కొత్తగా ఇంకేం సాధిస్తాంలే? అనుకుంటారు. అది ముమ్మాటికీ తప్పని తోటి మహిళలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ‘మిసెస్‌ ఇండియా-2021’ పోటీల్లో పాల్గొన్నాను. నిజానికి, నాకు తెలియకుండానే ఓ స్నేహితురాలు ఆ పోటీలకు నా ఫొటోలు పంపింది. నిర్వాహకుల నుంచి ఫోన్‌ వచ్చేవరకూ ఆ సంగతే తెలియదు నాకు. పెండ్లయిన వాళ్లకు మిసెస్‌ ఇండియా పోటీలు మంచి వేదికని నా అభిప్రాయం. పైగా నేను అంత పొడగరి కాదు, స్లిమ్‌గానూ ఉండను. అయితే ఏంటి? మనసు అందంగా ఉండటమే కదా ముఖ్యం! అని మనసులో గట్టిగా అనుకున్నాను. పోటీలకు హాజరై రన్నర్‌-అప్‌గా నిలిచాను. అందాలపోటీలకు వెళ్లాలనుకొనే గృహిణులను ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు చాలా ఉంటాయి. ఆంత్రప్రెన్యూర్‌గా మారాక జీవితంలో కొత్తకొత్త గమ్యాలు పెట్టుకోగలుగుతున్నాను. ఈ ఏడాదే మిసెస్‌ ఇండియా రన్నర్‌-
అప్‌తో పాటు ‘నారీ శక్తి ఉమెన్‌ ఐకాన్‌ అవార్డ్‌ -2021’ అందుకున్నాను. ఇండియన్‌ ఇన్‌స్పిరేషనల్‌ ఉమెన్‌ పురస్కారమూ వరించింది. ఇవన్నీ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇదంతా నేను కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికి రావడంవల్లే సాధ్యమైంది. సమయం ఇప్పటికీ మించిపోలేదు. నాలుగు పదులు, ఐదు పదుల గృహిణులు అయినా సరే, తమకు నచ్చిన రంగంలో కెరీర్‌ మొదలుపెడితే అద్భుతాలు సృష్టిస్తారు.

  • నిఖిత నెల్లుట్ల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement