Zareen Khan | బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు. ఈ వార్త సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేయగా, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సరసన ‘వీర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తన కెరీర్ ప్రారంభం నుంచే తల్లికి ఎంతో దగ్గరగా ఉండేది. గత కొన్ని ఏళ్లుగా పర్వీన్ ఖాన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 2016లో గుండె శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు కన్నుమూశారు.
జరీన్ ఖాన్ టీమ్ అధికారిక ప్రకటనలో, “మా ప్రియతమ పర్వీన్ ఖాన్ గారు ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారు” అని తెలిపారు. అదే రోజు సాయంత్రం ముంబైలోని వెర్సోవాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మధ్య జరీన్ తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ ఉండేది. ఫిబ్రవరిలో అమ్మ మళ్లీ ఆసుపత్రిలో చేరారు.. ఆమె కోసం ప్రార్థించండి” అంటూ పెట్టిన పోస్ట్ ఆమె తల్లిపట్ల ఉన్న ప్రేమను తెలియజేసింది. తల్లిని కాపాడుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఇప్పుడు ఆ జ్ఞాపకాలతోనే మిగిలిపోయారు.
ఇది మాత్రమే కాదు, జరీన్ ఖాన్‌ను వరుసగా రెండు విషాదాలు చుట్టుముట్టాయి. ఆమెకు ఎంతో ప్రీతిపాత్రమైన పెంపుడు పిల్లి ‘రాంబో’ ఏప్రిల్ 7న మరణించింది. “నా బిడ్డ నన్ను వదిలి వెళ్లిపోయింది” అంటూ నిన్ననే ఎమోషనల్ పోస్ట్ చేసిన జరీన్, మరుసటి రోజే తన తల్లిని కోల్పోవడం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా, జరీన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితమే. చాణక్య సినిమాలో గోపీచంద్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వీరప్పన్’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇక 2020లో వచ్చిన ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ తర్వాత జరీన్ సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.