అమరావతి : కర్నూలు ఘోర బస్సు ప్రమాదం ( Bus accident ) పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచి వేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ( Travell Bus Fire ) దగ్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనం అత్యంత విషాదకరమని అన్నారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
19 మంది సజీవదహనం..
కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న 42 మందిలో 19 మంది సజీవదహనమయ్యారు.
మిగతా ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు. సమాచారం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరగడంతో జాతీయర రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.