హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) భారీగా ఏర్పాటవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఏడున్నరేండ్లలో రూ.50 కోట్లలోపు పెట్టుబడితో కూడిన యూనిట్లు 56,735 నమోదు కాగా, వాటి ద్వారా 5,26,501 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ రంగంలో రూ. 24912 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఓ వైపు బడా పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూనే, మరోవైపు స్వయం ఉపాధి పొందేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల యువత స్వయం ఉపాధివైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు పరిశ్రమల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 56 వేల పైచిలుకు ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా రూ.కోటి లోపు పెట్టుబడితో కూడిన సూక్ష్మతరహా యూనిట్లే అధికంగా ఏర్పాటయ్యాయి. పేపర్ ప్లేట్లు, పేపర్ కప్పుల తయారీ, ఫ్యాబ్రికేషన్ వర్క్స్, ఆహార పదార్థాల తయారీ, రెడీమేడ్ దుస్తులు తదితర యూనిట్లు ఉన్నాయి. 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 44 శాతం పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి
అనుమతుల విషయంలో సమన్వయం చేస్తున్నాం
ఎంఎస్ఎంఈలకు అనుమతుల విషయంలో ఇతర శాఖల సమన్వయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం టీ-ఐడియా, టీ-ప్రైడ్ స్కీమ్‌ల ద్వారా విరివిగా సబ్సిడీలు ఇస్తుండడంతో నిరుద్యోగులు చిన్నచిన్న యూనిట్ల స్థాపనకు ముందుకొస్తున్నారు. -కృష్ణ భాస్కర్, డైరెక్టర్, పరిశ్రమల శాఖ
జనరల్ క్యాటగిరీకి టీ-ఐడియా (తెలంగాణా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్) ఇన్సెంటివ్ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 15 శాతం, గరిష్ఠంగా రూ. 20 లక్షలకు మించకుండా సబ్సిడీలు ఇస్తున్నారు. మహిళలకు 10 శాతం అదనం. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం టీ-ప్రైడ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 35 శాతం, గరిష్ఠంగా రూ.75 లక్షలకు మించకుండా సబ్సిడీలు ఇస్తున్నారు. మహిళలకు 10 శాతం అదనం. దళిత పారిశ్రామికవేత్తలకు 2014 నుంచి ఇప్పటివరకు రూ.1081 కోట్ల ప్రోత్సాహకాలు, గిరిజనులకు రూ.1,016 కోట్ల మేర రాయితీలు అందించారు. వికలాంగులకు రూ.83 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు.
నమోదైన ఎంఎస్ఎంఈలు 56,735,పెట్టుబడులు రూ. కోట్లలో 24,912
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 5,26,501