కారేపల్లి,ఆగస్టు 24: మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి యువతి ఆచూకీని కనిపెట్టారు. దాదాపు మూడు నెలల పాటు ఇంట్లో నుండి కనిపించకుండా పోయినఆ యువతిని సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. అదేవిధంగా పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి యువతిని మోసం చేసిన హైదరాబాదుకు చెందిన రుకుమ్ అనే యువకుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
కారేపల్లి ఎస్ఐ బైరు గోపి తెలిపిన వివరాల ప్రకారం కారేపల్లి మండల పరిధిలోని బల్లునగర్ తండాకు చెందిన తల్లిదండ్రులు తన కూతురు అదృశ్యమైనట్లు ఈ ఏడాది మే నెలలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి ఫోన్ వెంట తీసుకువెళ్లకపోవడంతో ట్రేస్ చేయడం ఇబ్బందిగా మారి ఆచూకీ కనిపెట్టేందుకు కొంత ఆలస్యమైందన్నారు. దీంతో ఆధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి యువతి ఆచూకీని గుర్తించినట్టు ఎస్ై పేర్కొన్నారు.పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిని అదుపులోకి తీసుకుని, యువతిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు.