Reels | సోషల్ మీడియాలో(Social media) రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని కొందరు చేస్తున్న కాన్సెప్ట్స్ వారి ప్రాణాల మీదకు తెస్తున్నది. తాజాగా జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై(Reels) రీల్(Reels) చేస్తుండగా కదులుతున్న రైలు ఢీకొనడంతో 19 ఏళ్ల యువతి మంగళవారం తన రెండు చేతులను కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్(Jharkhand)రాష్ట్రం గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోబరియా గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గర్వా పట్టణంలోని అశోక్ విహార్ మొహల్లాలో నివాసం ఉంటున్న పూర్ణిమ కుమారి అనే యువతి తన స్నేహితులతో కలిసి రీల్స్ చేసేందుకు జోబరీయా గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లింది.
ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన రాంచీ-చోపన్ రైలు పూర్ణిమను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు చేతులు కోల్పోయింది. శరీరంలోని పలు ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి స్నేహితులు పూర్తిమను దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, జార్ఖండ్‌లో ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పలువురు మృతి చెందారు. వరుస ఘటనలపై రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.