Arjun reddy | టాలీవుడ్ చరిత్రలో సంచలనం సృష్టించి కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలై వచ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, దీనికి సంబంధించిన ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఇటీవలే జరిగిన ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా, షాలిని పాండే హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ యువతను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా టాలీవుడ్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చివేసింది. ఈ సినిమా వచ్చే ఏడాదితో 10 ఏండ్లు పూర్తిచేసుకోనుంది. అయితే ఈ సందర్భంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేయాలని తాము ఆలోచిస్తున్నట్లు సందీప్ తెలిపారు. అంతేకాకుండా, కేవలం సాధారణ రీ-రిలీజ్ కాకుండా అభిమానులను అలరించేలా ఒక ప్రత్యేకమైన ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ గురించి సందీప్ మాట్లాడుతూ, నేను మరియు విజయ్ దేవరకొండ కలిసి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను దాని 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక ఎక్స్టెండెడ్ వెర్షన్‌తో తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. దీనికోసం విజయ్ దేవరకొండ కేవలం 2 నుంచి 3 రోజులు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. కానీ, నేను మాత్రం కూర్చుని సుమారు 15 నుంచి 20 రోజులు దీనిపై ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంది అని సందీప్ రెడ్డి వంగా వివరించారు. దర్శకుడిగా తాను ఈ వెర్షన్ కోసం అదనపు సీన్లు, మరింత కంటెంట్‌ను జోడించే పనిలో నిమగ్నం కానున్నట్లు స్పష్టం చేయడంతో సినిమా ప్రియుల్లో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.