హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఆర్ఎస్) నిర్మాణాల్లో ఆశించిన పురోగతి కనిపించడంలేదు. మొత్తం రూ.17,400 కోట్ల విలువైన పనుల్లో ఇప్పటి వరకు రూ.400కోట్ల విలువైన బిల్లులు చెల్లించారు. మరో రూ.17వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉన్నది.
ఇంకా 17 బడుల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం మొత్తం 87 పాఠశాలలను మంజూరు చేయగా, వీటిలో 70 స్కూళ్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఐదు పాఠశాలలకు ఇంకా డీపీఆర్ తయారు కాలేదు. మరో మూడు పాఠశాలలకు టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోగా, నాలుగు పాఠశాలలకు స్థల సమస్యలు ఉన్నాయి.
యంగ్ ఇండియా బడుల పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆర్థికశాఖ, విద్యా, సంక్షేమ వసతుల కల్పన సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) అధికారులతో సమీక్షించారు. వారానికోసారి పనుల పురోగతిని తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.