ఖైరతాబాద్, జూలై 17 : ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ)పై అతిపెద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా సోమాజిగూడలోని యశోద దవాఖాన ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఆన్లైన్ వేదికగా జరిగిన జరిగిన ఈ కార్యక్రమంలో ఒకేసారి 578 మంది పాల్గొనడంతో ఈ రికార్డు లభించింది. ఐబీడీపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ఈ వ్యాధిని ముందే గుర్తించేలా చూడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు యశోద దవాఖాన యాజమాన్యం వెల్లడించింది. గిన్నిస్ బుక్ రికార్డ్స్ అఫీషియల్ అడ్జడికేటర్ రిషినాథ్ సమక్షంలో యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ సెంటర్ ఫర్ ఐబీడీ డైరెక్టర్, సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ పెద్ది, యూనిట్ హెడ్ డాక్టర్ ఎస్ ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఈ రికార్డును అందుకున్నారు.
అనంతరం దవాఖానలో ‘ఐబీడీ కాంక్లేవ్-2.0’ పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దేశ, విదేశాలకు నుంచి 300 మందికిపైగా ప్రతినిధులు, ముగ్గురు అంతర్జాతీయ అధ్యాపకులు, 50 మందికిపైగా జాతీయ నిపుణులు హాజరయ్యారు. ఐబీడీ చికిత్సలో తాజా పురోగతులు, బయోలాజిక్ థెరపీలు, ఇంటెస్టినల్ అల్ట్రాసౌండ్, కృత్రిమ మేథస్సు వినియోగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం డాక్టర్ కిరణ్ పెద్ది, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ప్రతి ఐబీడీ రోగికి ప్రపంచస్థాయి వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని, గిన్నిస్ రికార్డు లభించడం తమ వైద్య బృందం అంకితభావానికి నిదర్శమని తెలిపారు.