చెన్నై: పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (5/23) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌కు తోడు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 నాటౌట్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో టీమిండియా వరుసగా మూడో విజయంతో అఫ్గానిస్థాన్‌ను వైట్‌వాష్ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అఫ్గాన్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.
జైస్వాల్ అద్భుత సెంచరీకి తోడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) అర్ధ శతకంతో మెరిశాడు. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (102) సెంచరీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అర్ధ శతకంతో రాణించారు. ప్రసిద్ధ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
తొలి స్పెల్‌లో వరుసగా ఐదు ఓవర్లు చేసిన పేసర్ ప్రసిద్ధ్.. బుల్లెట్లలాంటి బంతులతో టాపార్డర్‌ను కకావికలం చేశాడు. తన తొలి బంతికే స్లిప్‌లో రోహిత్ పట్టిన క్యాచ్‌తో ఇన్ఫామ్ ఓపెనర్ ్ల గుర్బాజ్ (5)ను ఔట్ చేశాడు. ప్రసిధ్ బౌలింగ్‌లోనే రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11)కూడా రోహిత్‌కు చిక్కారు. పదో ఓవర్లో రసూలీ (1)ని కూడా ప్రసిద్ధ్ ఔట్ చేయడంతో 36/4 తో నిలిచిన అఫ్గాన్ 100 పరుగులు కూడా చేయడం కష్టమే అనిపించింది. ఈ దశలో అద్భుతంగా పోరాడిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది జట్టును అదుకున్నాడు. ఒమర్జాయ్ సహకారంతో ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించిన అతను సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు స్కోరు 200 దాటించాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు అఫ్గాన్ బౌలర్లను దంచికొట్ట్టారు. జైస్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. అజ్మతుల్లా వేసిన మొదటి ఓవర్లోనే 3 ఫోర్లు బాదాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా జట్టులో స్థానం ఆశిస్తున్న జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లను మెప్పించాడు. తనదైన శైలిలో అలవోకగా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోఎండ్‌లో రోహిత్ కూడా క్లాసిక్ షాట్లతో బౌండరీలు రాబట్టాడు.
ఈ క్రమంలో జైస్వాల్ 38 బంతుల్లో, రోహిత్ 47 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. స్పిన్నర్ రషీద్ బౌలింగ్‌లో సిక్సర్లతో అలరించిన రోహిత్ మరో సిన్నర్ నబీ వేసిన బంతిని పుల్ చేయబోయి క్యాచ్ ఔటవడంతో 170 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా, జైస్వాల్ ఏమాత్రం తగ్గకుండా కేవలం 83 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ పూర్తి చేశాడు. అయ్యర్ (20 నాటౌట్) తోడుగా ముందుకెళ్లిన అతను నబీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
అఫ్గానిస్థాన్: 44.2 ఓవర్లలో 218 ఆలౌట్ (షాహిది 102, అజ్మతుల్లా 50, ప్రసిద్ధ్ 5/23); భారత్: 28.4 ఓవర్లలో 224/1 (జైస్వాల్ 110 నాటౌట్, రోహిత్ 79, నబీ 1/47)