
గద్వాల, నవంబర్ 24 : జోగుళాంబ గద్వాల జిల్లాలో యాసం గి సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపడుతున్న పథకాలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుండడంతో గతేడాది కంటే ఈ సారి సాగు పెరగనున్నట్లు అధికారుల అంచనా. పంట చేతికొ చ్చే వరకు రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యాసంగి సీజన్లో రైతులు ఏఏ పంటలు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.? అనే అంశాలను అధికారులు అంచనా వేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత యాసంగి కంటే ఈ ఏడాది 10 నుంచి 20 శాతం వరకు సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది యాసంగిలో జిల్లాలో 1,00,387 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది యాసంగి సీజన్లో 1,03,773 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్ర వాహం పెరగడంతో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుం టలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో పంటలకు కావాల్సినంత సాగు నీరు అందనున్నది. గత యాసంగిలో జిల్లాలో వరి 21,567 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి 30,913 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సాగు అంచనా..
జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో వరి 30,913, జొన్న 3,741, వేరుశనగ 22,436, సజ్జలు 45, మొక్కజొన్న 4,213, కొర్ర 128, శనగలు 29,528, పెసర్లు, మినుములు 3,512, కందులు 355, వాము 490, చెరుకు 853, ఉల్లి 641, కూరగాయల పంటలు 2,377, సన్ఫ్లవర్ 25, పొగాకు 2,842, ఆముదం 255, ఇతర పంటలు 1,419 ఎకరాల్లో సాగు చేయన్నుట్లు అధికారుల అంచనా.
ఆరుతడిపై అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం. పంట మార్పిడి చేయడం వల్ల రైతులకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. సాగుకు అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.