యాదాద్రి : మార్చి 28న స్వయంభువుల దర్శనం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకనుగు ణంగా భక్తుల వసతుల కల్పనపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే యాదాద్రి కొండపై ఈవో కార్యాలయం, వీవీఐపీ భవనాలు ప్రారంభమై అందుబాటులోకి వచ్చాయి. ఇక యాదాద్రి ప్రధానాలయానికి ఉత్తరాన 13.26 ఎకరాల గుట్టపై రూ. 143.08కోట్లు వ్యయంతో నిర్మించిన ప్రెసిడెన్సియల్ సూట్ల పనులు పూర్తి కాగా ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రపంచ దేశాలు అబ్బురపడే విధంగా యాదాద్రీశుడి నూతనాలయం రూపుదిద్దుకున్నది.
దీంతో పాటు అంతేస్థాయిలో యాదాద్రి చుట్టూ 10కిలో మీటర్ల మేర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రెండుమూడు రోజులు ఇక్కడే ఉండే విధంగా ఆలయ పరిసరాలు రూపుదిద్దుకుంటున్నాయి. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు యాదాద్రీశుడి దర్శించుకునేందుకు వస్తుంటారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. దీంతో పాటు మార్చి 22నుంచి 28వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ, సుదర్శన మహాయాగం నిర్వహించనున్న నేపథ్యంలో వచ్చే వీవీఐపీల విడిది కోసం కొండ దిగువన ఉత్తరాన 13.26 ఎకరాల చిన్న కొండపై 14విల్లాలు, ఒక ప్రెసిడెన్సియల్ సూట్ నిర్మించారు.
దాతల ఆర్థిక సహకారం రూ. 143.8 కోట్లతో నిర్మాణం చేపట్టగా పనులు పూర్తయ్యాయి. ఇందులో సుమారు రూ. 17కోట్ల వ్యయంతో 15,500 చదరపు అడుగులో ప్రెసిడెన్సియల్ సూట్‌ను కొండ శిఖరాగ్రాన కట్టారు. ఆ కింది ప్రాంగణంలో నాలుగు విల్లాలు, దిగువన మరో పది విల్లలు నిర్మాణ మయ్యాయి. ఒక్కొక్క దాన్ని 7500 చదరపు అడుగుల స్థలంలో రెండంతస్తులుగా నిర్మించారు. ఇందుకు గాను ఒక్కోక్క విల్లాకు సుమారు రూ. 5కోట్లు ఖర్చు చేశారు.
అధునాతన నిర్మాణాలు.. సెన్సార్ సిస్టమ్..
స్వామివారి దర్శించుకునేందుకు వచ్చే వీవీఐపీలు ప్రెసిడెన్సియల్ సూట్లో బస చేస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా అధునాతన నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 6 బెడ్ రూంలు, వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్, కిచెన్‌తో పాటు సేద తీరేందుకు సిట్ ఔట్ రూంలను సైతం ఏర్పాటు చేశారు. ఉడెన్ ప్లాస్టిక్‌తో కిటికీలు, టేకుతో తయారు చేసిన ద్వారాలను బిగించారు. బెడ్ రూంల్లో సెంట్రల్ ఏసీ, పక్కనే బాత్రూంలో కోయిలర్ గ్లాస్‌తో సెన్సార్ సిస్టంను ఏర్పాటు చేశారు. యాదాద్రీశుడిని దర్శించుకుని తిరిగి ప్రెసిడెన్సియల్ సూట్‌కు వచ్చేందుకు ప్రత్యేకమైన రోడ్లను నిర్మించారు.
ఈ నెల 12న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం కొండ దిగువన ఉత్తరాన నిర్మించిన ప్రెసిడెన్సియల్ సూట్ భవనాన్ని ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లపై వైటీడీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.