తుర్కపల్లి, అక్టోబర్ 27 : ‘విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన దళితబంధు పథకం ద్వారా వాసాలమర్రి గ్రామ దళితులు పురోగమిస్తున్నారు… సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టి విజయం సాధించి దేశానికే ఆదర్శంగా నిలువాలి’ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ‘దళితబంధు పథకం’ కింద మంజూరైన మొదటి పది మంది లబ్ధిదారులకు ఉపాధి పెట్టుబడి కింద పలు వాహనాలను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి బుధవారం అందజేశారు. ఈసందర్భంగా రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా లబ్ధిదారులతో ముచ్చటిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నదా..? తీసుకున్న వాహనాలను ఎలా వినియోగిస్తారు..? నెలకు ఎంత సంపాదిస్తారంటూ అడిగి తెలుసుకున్నారు. ఇతరులపై ఆధార పడకుండా వాహనాలను నడిపించుకుని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. అనంతరం సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చాలన్నారు. దళితబంధుపై మొదటకొందరికి అపోహలు, అనుమానాలు ఉండేవని, యూనిట్ల పంపిణీతో అవన్నీ తొలగిపోయాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం కోటి ఎకరాల మాగాణా కావాలని మాట్లాడితే.. చాలా మంది ఎలా అవుతుంది? ఎలా చేస్తారు? అని అనుకున్నారు కానీ, నేడు లక్ష్యం సాధించి చూపారని అన్నారు. దళితబంధు స్వప్నం సైతం పూర్తిగా సాకారం అవుతుందన్నారు. ఈ పథకం కేవలం ఓ కుటుంబానికి 10లక్షలు ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాదని ప్రపంచానికి ఒక గొప్పమార్గం చూపుతుందని పేర్కొన్నారు. ఉద్యమాలు, రాజకీయాలను కలగలిపి రాష్ట్రాన్ని ఎలా సాధించారో తెలంగాణ దళితబంధు కూడా అందరికీ అందించి ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా నిలువబోతుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి గత ప్రభుత్వాలు సాయం చేసే ప్రయత్నాలు చేశాయి కానీ, అనుకున్నంత మార్పు రాలేదని చెప్పారు. దళితబంధు సీఎం కేసీఆర్ చేసిన గొప్ప ఆలోచన.. అది దేశంలోనే సరికొత్త విప్లవాన్ని తీసుకువస్తుందని అన్నారు. ప్రభుత్వం చేసే సహాయం దళితుల జీవితాల్లో వెలుగులు నింపేదిగా ఉండాలనే ఈ పథకాన్ని చేపట్టారని వివరించారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని దళిత బంధును ప్రకటించిన 2,3 నెలల్లోనే నిజం చేసి చూపారన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలను నిలబెట్టే విధంగా దళితులు ఉన్నతి సాధించాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు కార్యరూపం తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ప్రగతి నాయకుడని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామం నుంచి దళితబంధు ప్రకటించడం మన అదృష్టమని దళితులకు ఎంతో గౌవరవం ఇచ్చారన్నారు. లబ్ధి దారులకు నైపుణ్యం ఉన్న రంగాల్లోనే ఆర్థికసాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారని ఎలాంటి బ్యాంక్ లింకేజీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులను జమ చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్, ప్రధాన కార్యాలయం ప్రత్యేకాధికారి ఆనంద్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఎంపీపీ భూక్యా సుశీలా రవీందర్, జడ్పీ వైస్‌చైర్మన్ బీకూనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఎం.శ్రీనివాస్, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ ఉమాదేవి, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్, కోఆప్షన్ రహమత్ షరీఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్ద్దూనాయక్, మంజుల, నాయకులు బబ్బూరి రవీందర్నాథ్గౌడ్, రాజయ్య, కరుణాకర్‌రెడ్డి, సత్యనారాయణ, తలారి శ్రీనివాస్ పాల్గొన్నారు.