పోడు భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతున్నది. ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించాలని ఎంతోకాలంగా చేస్తున్న గిరిజనుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న వారి నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. దీని కోసం సంబంధిత శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1400 ఎకరాలు ఉన్న పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు నిర్ధారణ కాగా.. ఆయా భూములపై హక్కులు కల్పించే దిశగా అడుగులు పడుతుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
యాదాద్రి భువనగిరి, నవంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అడవి బిడ్డలకు పోడు భూములపై హక్కులు కల్పించే దిశగా జిల్లాలో అడుగులు పడుతున్నాయి. పారదర్శకంగా అర్హులకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో గిరిజన తండాలను ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో గిరిజనులు ఎన్నో ఏండ్లుగా పంటలను సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో కొందరు గిరిజనేతరులు కూడా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో పోడు వ్యవసాయం చేస్తున్న కొందరు రైతులకు ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలను అందజేసింది. జిల్లాలో 1,400 ఎకరాల్లో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న కొంతమందికి మాత్రమే అప్పట్లో హక్కు పత్రాలను అందజేయగా.. చాలామందికి పత్రాలు ఇవ్వలేదు. జీవనోపాధి కోసం చాలామంది రైతులు అటవీ భూములను సైతం ఆక్రమించుకుని పంటలను పండించుకుంటున్నారు. పోడు వ్యవసాయం కారణంగా పలు సమస్యలు వస్తున్నాయి. హరితహారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడానికి వెళ్లడం..రైతులు అడ్డుకోవడం వంటి ఘటనలు సైతం అడపాదడపాగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రభుత్వం ఆయా భూములకు రైతు బంధు పథకం కింద ఉచిత పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ఈ క్రమంలోనే..అర్హులందరికీ పట్టాలు అందజేసేందుకు సోమవారం నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేలు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. గ్రామ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించడంతోపాటు రైతుల ఉంచి ఫారమ్-ఏ ద్వారా క్లెయిమ్ స్వీకరిస్తారు. మూడ్రోజులపాటు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రభుత్వం చర్యలతో పోడు భూముల సాగుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి
పోడు భూములు ఎక్కడెక్కడంటే..
చౌటుప్పల్ మండలం లక్కవరం గ్రామం, సంస్థాన్ నారాయణపురం మండలం కడీలబాయి తండా, పల్లగుట్ట తండా, రాచకొండ, తూంబాయితండా వెంకంబావి తండా, ఎనగండి తండా, తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామ పరిధిలో పోడు భూములున్నాయి. మూడు మండలాల్లోని ఎనిమిది గ్రామాల పరిధిలో పోడు భూములు ఉన్నాయి. వీటి పరిధిలోని 1,400 ఎకరాలను రైతులు సాగు చేసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
గ్రామ నుంచి జిల్లా స్థాయి వరకు బృందాలు
గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు మూడు స్థాయిల్లో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఏ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సర్వేయర్ సభ్యులుగా ఉంటారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నాన్ అఫీషియల్ మెంబర్ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. అలాగే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, ఫారెస్ట్ అధికారి, పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్, గిరిజనులు, మహిళలతో 10 నుంచి 15 మందితో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్దేశాలను నెరవేర్చేలా చర్యలు
అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంతోపాటు, అడవులను నమ్ముకుని జీవిస్తున్న వారిని కాపాడడమే ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించేందుకు సంకల్పించారు. దీనివల్ల ఏళ్ల తరబడిగా ఉన్న పోడు భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రైతుల నుంచి అర్జీలను స్వీకరించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వ ఉద్దేశాలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం.
హక్కు పత్రం జారీ ఇలా..
గ్రామ సభల్లోనే అటవీ హక్కుల కమిటీని ఎన్నుకుంటారు. రైతుల నుంచి వచ్చే దరఖాస్తులను ఎఫ్ఆర్సీ(ఫారెస్ట్ రైట్స్ కమిటీ)లే స్వీకరిస్తాయి. ఈ కమిటీ పర్యవేక్షణలో రైతు చూపించిన భూమిలో ప్రాథమికంగా సర్వే చేపడతారు. సర్వే నివేదికతోపాటు సంబంధిత భూమి మ్యాపు, దరఖాస్తును గ్రామ సభల్లో ప్రవేశపెట్టి అందరి సమక్షంలో తీర్మానించి అభ్యంతరాలు లేకుండా పరిశీలిస్తారు. ఈ మేరకు ఎఫ్ఆర్సీ సమావేశంలో తీర్మానించి సంబంధిత దరఖాస్తుతో కూడిన నివేదికను సబ్ డివిజన్ స్థాయి కమిటీకి నివేదిస్తారు. పలానా తేదీలో సర్వే నిమిత్తం రానున్నట్లు సంబంధిత రైతుకు నోటీసులు జారీ చేస్తారు. సర్వే నిర్వహించిన తర్వాత సంబంధిత పోడు భూమికి హద్దులు నిర్ణయించి జిల్లాస్థాయి కమిటీకి అనుమతుల కోసం ప్రతిపాదిస్తారు. జిల్లాస్థాయి కమిటీ పరిశీలన అనంతరం హక్కు పత్రాన్ని జారీ చేస్తారు.