యాదాద్రి, నవంబర్ 6 : పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందడి నెలకొన్నది. తొలి శనివారం కావడంతో స్వయంభువులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. భక్తులతో ఆలయ పురవీధులు కిటకిటలాడాయి. భక్తుల రద్దీతోపాటు ఆలయ పునర్నిర్నాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాలను కొండపైకి అనుమతించలేదు. స్వామివారి పాదాల నుంచి పాతగోశాల వద్దకు వాహనాలను మళ్లించారు. స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము నాలుగు గంటలకు మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి శ్రీసుదర్శన నారసింహ హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతును నిర్వహించారు. రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు.
భక్తిశ్రద్ధలతో వ్రత పూజలు..
కార్తీకమాసం సందర్భంగా కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంతో పాటు పాతగుట్ట ఆలయం వ్రత మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వ్రతాలు నిరాటంకంగా సాగాయి. 2 గంటలకు ఒక బ్యాచ్ చొప్పన మొత్తం 6 బ్యాచ్‌ల్లో భక్తులు వ్రతమాచరించారు. శనివారం ఒకే రోజు 411 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున మహిళలు దీపారాధన గావించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,89,942
వీఐపీ దర్శనం 1,20,000
నిత్య కైంకర్యాలు 3,801
సుప్రభాత సేవ 400
వేద ఆశీర్వచనం 7,740
క్యారీబ్యాగుల విక్రయం 3,850
టెంకాయల విక్రయం 45,000
వ్రత పూజలు 2,05,500
కల్యాణకట్ట టిక్కెట్లు 27,000
ప్రసాద విక్రయం 3,91,800
వాహన పూజలు 13,300
టోల్గేట్ 1,440
అన్నదాన విరాళం 44,271
సువర్ణ పుష్పార్చన 1,13,460
యాదరుషి నిలయం 86,140
పాతగుట్ట నుంచి 49,405
గోపూజ 300
ఇతర విభాగాలు 59,307