ప్రపంచంలోనే అత్యంత పెద్ద, సకల హంగులతో కూడిన హోటల్‌ను మక్కాలోని సౌదీ సిటీలో నిర్మిస్తున్నారు. ఈ హోటల్‌కు అబ్రాజ్ కుడాయి అని నామకరణం చేశారు. లగ్జరీ సదుపాయాలతో కూడిన ఈ హోటల్లో మొత్తం 12 టవర్లలో 70 రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 10 వేల రూమ్‌లను నిర్మిస్తున్నారు. హోటల్ భవనం నాలుగు టవర్లపై నాలుగు హెలిప్యాడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక టవర్‌లో అత్యధికంగా 45 ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. 30 ఫ్లోర్లతో మరో టవర్ నిర్మిస్తున్నారు. మిగతా టవర్లలో 30 నుంచి 40 ఫ్లోర్లు ఉండనున్నాయి. ఈ హోటల్ నిర్మాణానికి మొత్తం 233 బిలియన్ రూపాయాలు ఖర్చు పెడుతున్నారు. దీంట్లో ఐదు ఫ్లోర్లు కేవలం సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీకి మాత్రమే కేటాయించనున్నారు. సామాన్య జనం ఈ ఫ్లోర్లలోకి వెళ్లేందుకు అనుమతి లేదు. అత్యంత ఎత్తైన, ఖరీదైన హోటల్ నిర్మాణాన్ని దార్ అల్ హంద్షా గ్రూప్ రూపకల్పన చేసింది. ఈ హోటల్ నిర్మాణం 2017లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల పనులు ఆపేశారు. ఈ హోటల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయం స్పష్టత లేదు.