హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్న వేశారు. ట్విట్టర్ యూజర్లకు సండే క్విజ్ అంటూ.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడుంది?’ అని అడిగారు. గత గురువారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫొటోను ట్వీట్ చేసి.. ఇది ఎక్కడుందో చెప్పగలరా? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈ ఆదివారం అమెజాన్ క్యాంపస్ భవన చిత్రాన్ని షేర్ చేసి.. ‘ఇది ఎక్కడ ఉంది?’ అని అడిగారు. దీనికి స్పందించిన వేలమంది నెటిజన్లు.. ‘గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్’ అంటూ సమాధానమిచ్చారు.