భీమ్‌గల్, జూన్ 24: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఎంప్లాయీస్ ఆండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆద్వర్యంలో కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రూ.26 వేల కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేశ్‌బాబు డిమాండ్ చేశారు.
కేటగిరీల వారీగా వేతనాలను పెంచాలన్నారు. పట్టణాల విస్తీర్ణం పెరుగుతుంటే అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచకుండా తీవ్ర పనిభారాన్ని మోపడం సరైనది కాదని తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. నాయకులు అంజయ్య, ఓంకార్, రాజన్న, విజయ్, మనోహర్, బాలమణి, గంగవ్వ, సాయమ్మ పాల్గొన్నారు.