పునఃప్రారంభించిన అడిషనల్ డీజీ స్వాతిలక్రా
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఆధునీకరించిన రాష్ట్ర మహిళా భద్రతా విభాగం వెబ్సైట్ను అడిషనల్ డీజీ స్వాతిలక్రా మంగళవారం ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్డీకాపూల్లోని కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐజీ సుమతి ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళలు, యువతుల భద్రతే లక్ష్యంగా మరికొన్ని సాంకేతిక అంశాలను ఈ వెబ్సైట్లో జోడించినట్టు వారు పేర్కొన్నారు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లోనూ ఈ వెబ్సైట్ ద్వారా సేవలను పొందవచ్చు. మహిళలు తమ రక్షణకు సంబంధించి ఏ విధమైన ఫిర్యాదునైనా ఈ వెబ్సైట్ ద్వారా ఇచ్చేలా కొత్త ఫీచర్లను జోడించారు. షీటీమ్స్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబ్ హర్, ఎన్నారై సెల్ వంటి అనేక విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడి నుంచి పొందేలా రూపొందించారు.