దేశ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారి, ఉత్కంఠ రేకెత్తించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్‌సభలో వీగిపోయిన తొలిబిల్లు ఇదే. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు దేశంలోని దాదాపు అన్ని పార్టీలు అంగీకారం తెలుపుతున్నాయి. కానీ బిల్లు ఎందుకు వీగిపోయిందనేది ఇప్పుడు చర్చనీయాంశం. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు చాటున లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కూడా బాటలు వేయాలని చూసింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ ప్రతిపక్షాలు ముందు నుంచి చెప్తున్నట్టుగానే బిల్లుపై వ్యతిరేక గళం వినిపించాయి. ముక్తకంఠంతో బిల్లును తిరస్కరించి కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి.
రాజకీయ పార్టీలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు వేసి చతికిల పడింది. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి తీరుతామని మోదీ సర్కార్ ప్రగల్భాలు పలికింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లను 850కి పెంచేందుకు యత్నించింది. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా బీజేపీ పాలకులు పట్టించుకోలేదు. కేంద్రం లోక్‌సభ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణకు సైతం సిద్ధపడింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచి, 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని నమ్మబలికింది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో బ్రేక్ పడింది. లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది ఉన్నారు. వీరిలో 298 మంది అనుకూల, 230 మంది వ్యతిరేక ఓటు వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి 2/3వ వంతు సభ్యులు అంటే 360 మంది సభ్యులు అనుకూల ఓటు వేయాల్సి ఉంటుంది.
కానీ ఎన్డీఏకు ఉన్న బలం కేవలం 292 కాగా ఓటింగ్‌లో అనుకూలంగా పడిన ఓట్లు 298. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం ప్రతిపాదిత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026ను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. విపక్షాల సభ్యులు గైర్హాజరు అయితేనో, వారిలలో కొందరు మద్దతు తెలిపితేనో బిల్లుపై ఓటింగ్‌లో గట్టెక్కుతామని కేంద్రం పెద్దలు, బీజేపీ మద్దతుదారులు భావించారు. కానీ.. విపక్షాలు ఏకతాటిపై నిలబడి కేంద్రానికి గట్టి సమాధానం చెప్పాయి. పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులలో వీగిపోయిన బిల్లు ఇదొక్కటే కావడం గమనార్హం. మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళలకు 33% రిజర్వేషన్ల పట్ల విపక్షాల నుంచి అభ్యంతరాలేమీ వ్యక్తం చేయలేదు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతున్న తీరునే తప్పుబట్టాయి. డీలిమిటేషన్ ప్రక్రియకు అనుసరిస్తున్న విధానాలు అసంబద్ధంగా ఉన్నాయని దక్షిణాది రాష్ర్టాలకు చెందిన పార్టీలు వ్యతిరేకించాయి.
ఎక్కువ జనాభా, తక్కువ అభివృద్ధి కలిగిన రాష్ర్టాలు (ఉదా. యూపీ) వర్సెస్ తక్కువ జనాభా, ఎక్కువ అభివృద్ధి (ఉదా.తెలంగాణ, కేరళ, తమిళనాడు) మధ్య వ్యత్యాసాలను దక్షిణాదిపార్టీలు చర్చకు తీసుకొచ్చాయి. కేంద్రం చేపట్టిన కసరత్తు కారణంగా దక్షిణాది రాష్ర్టాలకు రాజకీయ బలం తగ్గిపోతుంది కాబట్టి, పార్టీలు, ప్రజాస్వామిక సంఘాలు వ్యతిరేకించాయి.
కేంద్రం వైఖరిపై జాతీయ స్థాయిలో విపక్షాలు అభ్యంతరాలు తెలిపాయి. సభలో బిల్లులను వ్యతిరేకించాయి. ప్రత్యేక సమావేశాల ద్వారా బిల్లులు ప్రవేశపెట్టి, బలవంతంగా ఆమోదింపజేసుకోవాలన్న వైఖరి సరికాదని విమర్శలు గుప్పించాయి. దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యం తగ్గించేలా కేంద్రం వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పాయి. లోక్‌సభ స్థానాల పునర్విభజన కుట్ర అని, ఇదొక నల్ల చట్టం అని ఆగ్రహం వ్యక్తంచేశాయి. కచ్చితమైన జనాభా లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన పెద్ద తప్పిదమని, ఇది సరైన చర్య కాదని తేల్చిచెప్పాయి. దేశ రాజకీయ నిర్మాణ స్వరూపాన్ని మార్చే స్వభావం కలిగిన డీలిమిటేషన్ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టి తెరపైకి తీసుకొచ్చింది. తాము మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని చిత్రీకరించేందుకు ఎత్తుగడ వేసింది. కానీ మహిళా బిల్లు వేరు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వేరు అని విపక్షాలు లోక్‌సభ ముందు సమర్థవంతంగా తమ వాదన వినిపించాయి.
కుటుంబ నియంత్రణ, బాలికా విద్య, వైద్య రంగాల్లో మెరుగైన కార్యక్రమాలను దశాబ్దాలుగా అమలు చేయడం వల్ల, అధిక అక్షరాస్యత కారణంగా దక్షిణాదిలో జనాభా నియంత్రణలో ఉన్నది. కాబట్టి ఉత్తరాది రాష్ర్టాలకు అధిక సీట్లు పెంచి, తమకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని దక్షిణాది రాష్ర్టాల పార్టీలు తెగేసి చెప్పాయి. కానీ ఎవరికీ అన్యాయం చేయబోమని నమ్మబలుకుతూనే కేంద్రం దూకుడుగా వ్యవహరించింది. కనీసం దక్షిణాది ప్రజలు వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్ప లేదు. ఇప్పుడున్న సీట్లకు అదనంగా మరో 50 శాతం పెంచుతామని చెప్తూ వచ్చారేగానీ బిల్లు ప్రతుల్లో ఎక్కడా పేర్కొనలేదు. సభలో చర్చ సందర్భంగా అమిత్‌షా 50 శాతం అంశాన్ని బిల్లు లో చేర్చుతామని అంగీకరించకతప్పని పరిస్థితి వచ్చింది. కానీ కేంద్రం చిత్తుశుద్ధిపై పార్టీలు నమ్మకం పెట్టుకోలేదు. మరోవైపు డీలిమిటేషన్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరమున్నది. కానీ రాజ్యాంగ సవరణ అవసరం లేని మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కేంద్రం చాకచక్యంగా తెరపైకి ఎందుకు తీసుకొచ్చిందనేది ప్రశ్నార్థకం. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు, అంతా మా ఇష్టం అన్నట్టుగా కేంద్ర ప్రభు త్వ పెద్దలు వ్యవహరించారు. గతంలో అనేక బిల్లులను ఆమోదింపజేసుకున్నట్టుగానే ఈ బిల్లునూ తమ ఖాతాలో వేసుకోవాలని యత్నించారు. కానీ ఈ సారి ఆటలు సాగలేదు. మా గొంతులు నొక్కే సే బిల్లు ప్రవేశపెడితే.. మీతో మేం గొంతు కలిపే ప్రసక్తే లేదు అని విపక్షాలు తేల్చిచెప్పాయి. సర్కార్ ఏకపక్షంగా తెచ్చిన బిల్లును వీగిపోయేలా చేసి ప్రభుత్వ ఉద్దేశాలను ఎండగట్టాయి.
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లోనే లోక్‌సభలో ఆమోదింపజేసింది. ఇందుకు విపక్షాలు సంఘీభావం తెలిపాయి. కానీ ఆ బిల్లుపై తదుపరి ప్రక్రియను చేపట్టి, చట్టరూపం కల్పించాల్సిన మోదీ సర్కార్, మళ్లీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది.
డీలిమిటేషన్‌కు అవసరమయ్యే రాజ్యాంగ సవరణ బిల్లును, రాజ్యాంగ సవరణతో సంబంధమే లేని మహిళా రిజర్వేషన్ బిల్లును కలిపి ముందుకు తెచ్చింది. ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని విపక్షాలు మరోసారి తేల్చిచెప్పాయి. కానీ దేశ రాజకీయ నిర్మాణాన్ని దెబ్బతీసే నమూనాలో డీలిమిటేషన్‌కు ఆమోదం తెలిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులు, పరస్పర అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకానీ ‘అంతా మా ఇష్టం’ అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎక్కడో ఓ దగ్గర ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సరిగ్గా అదే జరిగింది. 12 ఏండ్లపాటు మిత్రపక్షాల మద్దతు, ‘అవసరాల’ కోసం మద్దతు దారుల్లో నడిచే విపక్షాలను తమవైపు తిప్పుకోవడం ద్వారా అనేక బిల్లుల ఓటింగ్‌లో బీజేపీ సర్కార్ గట్టెక్కింది. భూసేకరణ చట్టం, వ్యవసాయ చట్టాల బిల్లుల సమయంలో విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ఆమోదం పొందాయి. కానీ మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి.
కేంద్రం రాజ్యాంగ సవరణ అవసరం లేని మహిళా రిజర్వేషన్ బిల్లును, రాజ్యాంగ సవరణ అవసరమైన డీలిమిటేషన్ బిల్లును ఒకేసారి సభ ముందుకు తీసుకురావడం విడ్డూరం. గతంలో విపక్షాలు మద్దతు తెలిపినప్పటికీ మళ్లీ మహిళా బిల్లును సభ ముందుకు తీసుకురావడంలో కేంద్రం ఉద్దేశం, ఆంతర్యమేంటో అంతుపట్టడంలేదు. మహిళా బిల్లుకు విపక్షాలు మద్దతు తెలుపలేదని చిత్రీకరించేందుకా? లేకపోతే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును పట్టాలెక్కించాలని చూసిందా? రానున్న పలు రాష్ర్టాల ఎన్నికల్లో ఇదే అస్ర్తాలతో బీజేపీ ప్రచారం నిర్వహించనున్నదా? బలం లేకపోయినా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం బీజేపీ సర్కార్ అనాలోచితమా? లేకపోతే మరో ఆలోచన ఏమైనా దాగి ఉన్నదా? అనేది భవిష్యత్తు రాజకీయ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. బిల్లు వీగిపోగానే బీజేపీ మహిళా ఎంపీలు పార్లమెంట్ బయట విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దుమ్మెత్తి పోస్తూ ర్యాలీగా బయల్దేరారు. రాగల కాలంలో రాకీయాలకు ఇదొక సంకేతమే! ఇప్పటికైతే రానున్న జనాభా లెక్కలు తేలే వరకు పునర్విభజనను వాయిదా వేయించి, విపక్షాలు విజయం సాధించాయని చెప్పవచ్చు.