మెట్రో నగరాల్లో ఉదయాన్నే లేవగానే కనిపించేది గడియారం ముల్లు కంగారే. ఒకచేత్తో ఇంట్లో వంట పాత్రల సవ్వడి, మరోచేత్తో ఆఫీసు బ్యాగు సర్దుకునే హడావుడి. నగరాల్లో నివసించే ఉద్యోగినుల జీవితం ప్రతిరోజూ ఒక రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపిస్తుంది. ఇల్లేమో నగరం చివరన, ఉద్యోగం నగరం నడిబొడ్డున. రోజూ ఆఫీస్‌కి వెళ్లడానికే కనీసం రెండు మూడు గంటల సమయం ప్రయాణానికే కేటాయించాల్సి వస్తుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణమే వారి శారీరక, మానసిక ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నది. టూవీలర్‌తో ట్రాఫిక్‌లో యుద్ధం, కికిరిసిన బస్సులు, మెట్రోల్లో ప్రయాణం చేయడం వాళ్లకు ప్రసవ వేదనలా మారుతున్నది.
సమయానికి ఆఫీసుకు చేరుకోవాలనే కంగారు ఒకటైతే, ప్రయాణంలో ఎదురయ్యే పొగ, దుమ్ము, విపరీతమైన శబ్దాలు వారి నరాలను పిండేస్తున్నాయి. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం లేదా నిలబడి ప్రయాణించడం వల్ల చాలామంది మహిళలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రయాణంలో ఎక్కువ కుదుపులకు గురవ్వడం వల్ల స్పాండిలైటిస్, లోయర్ బ్యాక్ పెయిన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
ప్రయాణంలోనే సగం శక్తి ఖర్చయిపోవడంతో ఆఫీసులో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నారు. అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చాక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కూడా వాళ్లకు ఉండదు. ఇంటి పనులు, పిల్లల చదువులు, వంట వార్పు ఆమె చూసుకోవాల్సిందే! శారీరక అలసట వల్ల కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సమయం కరువవుతున్నది. రాత్రివేళల్లో నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో అటు ఆఫీసులో పూర్తిస్థాయిలో రాణించలేక, ఇటు ఇంట్లోనూ ప్రశాంతంగా ఉండలేక నిరంతరం నలిగిపోతున్నారు.
ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా నిలదొకుకోవాలనే మహిళల ఆకాంక్షను ఈ ప్రయాణ బడలిక అణచివేస్తున్నది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే..వారానికి రెండు రోజులైనా వర్ ఫ్రమ్ హోమ్ లేదా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇచ్చే కంపెనీలనైనా ఎంచుకోవాలి లేదంటే తోటి ఉద్యోగులతో కలిసి కార్ పూలింగ్ అయినా చేయాలి. ఇంటి పనులు, పిల్లల బాధ్యతల్లో పురుషులనూ భాగస్వామ్యం చేయాలి. మహిళా సాధికారత అంటే కంపెనీలు కేవలం ఉద్యోగాలు ఇస్తే సరిపోదు, వాళ్లు ఆరోగ్యంగా, ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే పరిపూర్ణమవుతుంది.