Viral news : బొద్దింకలు (Cockroaches) ఇల్లంతా తిరుగుతూ చికాకు తెప్పిస్తాయి. దాంతో వాటిని నిర్మూలించేందుకు ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్‌ను ఉపయోగిస్తుంటారు. కొందరు సొంత ప్రయోగాలు చేస్తుంటారు. దక్షిణ కొరియా (South Korea) కు చెందిన ఓ యువతి కూడా బొద్దింకను చంపేందుకు అలాంటి సొంత ప్రయోగమే చేసింది. కానీ ఆ ప్రయోగం బెడిసికొట్టి ఏకంగా అపార్టుమెంటే తగులబడింది.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియాకు చెందిన 20 ఏళ్ల యువతి ఓ పెద్ద అపార్ట్మెంటులో నివాసం ఉంటోంది. ఆదివారం ఆ యువతి తన ఫ్లాట్‌లో పనులు చేసుకుంటూ ఉండగా బొద్దింక కనిపించింది. దాంతో దాన్ని చంపడానికి ఓ ప్రయోగం చేసింది. మండే స్వభావం ఉన్న స్ప్రేను బొద్దింకపై చల్లి లైటర్‌తో నిప్పంటించింది. ఆ బొద్దింక కాలిపోతూ ఇంట్లోని సామాగ్రి కిందకు వెళ్లడంతో మంటలు అంటుకున్నాయి.
కాసేపట్లోనే ఆ మంటలు పక్క ఫ్లాట్లకు కూడా వ్యాపించాయి. ఐదో అంతస్తులోని ఓ మహిళ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందకు దూకింది. ఆమె అక్కడికక్కడే మరణించింది. అపార్టుమెంటులో మంటలు, పొగ కారణంగా మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంత ఘోరానికి కారణమైన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.