Karnataka CM : బెంగళూరు (Bengalore) లో రోడ్ల దుస్థితి గురించి, ట్రాఫిక్ సమస్యల గురించి కొంతకాలంగా కర్ణాటక సర్కారు (Karnataka govt) పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ వంటి ప్రముఖులు ఈ సమస్యలను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వారం రోజుల లోగా బెంగళూరు రోడ్లపై ఉన్న అన్ని గుంతలను పూడ్చేయాలని సీఎం ఆదేశించారు. నగరంలోని ఐదు కార్పొరేషన్ల పరిధిలోని గుంతల మరమ్మతులకు అక్టోబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైట్ టాపింగ్ సహా రోడ్ల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు రోడ్ల సమస్యలపై గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ తుషార్ గిరినాథ్ సహా తదితర అధికారులతో చర్చించినట్లు సీఎం తెలిపారు. అయితే ఈ ఏడాది ఎక్కువ వర్షాలు పడడంవల్ల రోడ్లపై పడిన గుంతలను పూడ్చడం ఆలస్యమయ్యిందని పేర్కొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు కొనసాగుతున్నాయని, వైట్ టాపింగ్ చేయడంవల్ల రోడ్లు 25 నుంచి 30 ఏళ్లపాటు మన్నికగా ఉంటున్నాయని తెలిపారు.