Japan PM : అతివాద నేతగా పేరున్న సనే తకాయిచి (Sanae Takaichi) జపాన్ (Japan) తొలి మహిళా ప్రధాని (First female Prime Minister) గా ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ మంగళవారం సనే తకాయిచిని ప్రధానిగా ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దాంతో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనే తకాయిచి ఎన్నికయ్యారు.
ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువసభలో అధికార పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువసభలో కూడా మెజారిటీని కోల్పోయింది. దాంతో ఇషిబాపై ఒత్తిడి పెరిగి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరుగగా.. మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితోపాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి తకాయించి విజయం సాధించారు.
ఇవాళ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమి నుంచి తకాయిచికి భారీ మద్దతు లభించింది. దాంతో జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల తకాయిచి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిత్వ పదవితోపాటు పలు కీలక పదవుల్లో పనిచేశారు.