న్యూఢిల్లీ: అవివాహిత గర్భాన్ని దాల్చిన 23 వారాల తర్వాత ఆ పిండాన్ని తొలగించేందుకు అనుమతించడం లేదని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో తెలిపింది. పిండాన్ని తొలగించడం అంటే భ్రూణ హత్యకు పాల్పడినట్లు అవుతుందని కోర్టు చెప్పింది. చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ అవివాహిత మహిళ దాఖలు చేసుకున్న పిటిషన్ను ఇవాళ ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారించింది. అయితే సదురు మహిళను సురక్షితంగా ఎక్కడో ఒక దగ్గర ఉంచాలని, శిశువుకు జన్మనిచ్చే వరకు వాళ్ల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. ఎందుకంటే పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్లు క్యూ కడుతున్నారని ధర్మాసనం చెప్పింది. ధర్మాసనంలో జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ కూడా ఉన్నారు.
అవివాహిత అయినందున ఆ మహిళ అప్పటికే మానసిక క్షోభను అనుభవిస్తోందని, ఇక శిశువును పెంచే స్థోమత కూడా ఆమెకు లేదని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. ఆ సమయంలో కోర్టు జోక్యం చేసుకుని, పిల్లను పెంచాలని తాము అనడం లేదని, తొలుత ఆ అమ్మాయిని మంచి హాస్పిటల్కు తీసుకువెళ్లాలని, వారి వివరాలను బయటకు వెళ్లడించం అని, పురుడుపోసుకున్న తర్వాత మళ్లీ కోర్టుకు రావాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొన్నది.