హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ హోదాతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు డిమాండ్‌ను కేంద్రం మరోమారు పెడచెవిన పెట్టింది. 8 ఏండ్లుగా తెలంగాణ సర్కారు విన్నపాన్ని పట్టించుకున్నట్లుగా అనిపించలేదు. తాజా బడ్జెట్లో కూడా తూతూమంత్రంగా నిధులను కేటాయించి చేతులు దులుపుకుంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాలకు రూ.40 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. అయితే ఏ రాష్ర్టానికి ఎంత అనేది వెల్లడించలేదు. గతేడాది గిరిజన యూనివర్సిటీకి రూ.50 కోట్లు కేటాయించినా, కేవలం రూ. 9.74 కోట్లే ఇచ్చింది. కేంద్రం కేటాయిపులు చూస్తుంటే గిరిజన వర్సిటీ మరో నలభై ఏండ్లయినా ఏర్పాటయ్యే సూచనలు కనిపించడంలేదు. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 94 షెడ్యూల్13 (3) ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పాల్సి ఉంది. వరంగల్ సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని తెలంగాణ సర్కారు గతంలోనే గుర్తించింది.