(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్లో ఏదైనా అంశంపై సమగ్రమైన సమాచారం కావాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘వికీపీడియా’. అయితే, వికీపీడియా పేజీల్లోని ఎంట్రీలను తమకు అనుకూలంగా అదానీ గ్రూప్ సవరించినట్టు తాజాగా వెల్లడైంది. ఈ మేరకు వికీపీడియా ఆన్లైన్ న్యూస్‌పేపర్ ‘సైన్‌పోస్ట్’ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. అదానీ గ్రూప్ సాక్ష్యాలను ఎలా తొలగించిందో చూడాలంటూ ఈ నివేదికను ‘హిండెన్‌బర్గ్’ అధిపతి నాథే అండర్సన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ‘హిండెన్‌బర్గ్’ నివేదిక నేపథ్యంలోనే అదానీ గ్రూప్ ఈ సవరణలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. దీని కోసం ఎంట్రీ ఎడిటర్లకు, ఉద్యోగులకు కోట్లాది రూపాయలను చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి.
40కి పైగా సాక్ పప్పెట్ అకౌంట్లతో
హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ విలువలు దారుణంగా పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉదంతంపై దృష్టి కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌నకు సంబంధించి వికీపీడియాలో శోధనలు అంతకంతకూ పెరిగాయి. దీంతో వికీపీడియా ఆర్టికల్స్‌లోని సమాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుతూ.. అదానీ గ్రూప్ మ్యానిప్యులేషన్‌కు పాల్పడిందని ‘సైన్‌పోస్ట్’ పేర్కొంది. 40కి పైగా సాక్ పప్పెట్ అకౌంట్లను (ఖాతా ఒకరిది, నియంత్రించేది మరొకరు) ఉపయోగించి, పెయిడ్ ఎడిటర్లతో కథనాలు రాయించుకున్నట్టు వెల్లడించింది. వెంటనే ఆయా ఆర్టికల్స్‌ను బ్లాక్ చేసినట్టు వివరించింది. వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్‌కు కూడా దొరక్కుండా కొన్ని ఆర్టికల్స్‌ను రూపొందించినట్టు వెల్లడించింది.
ఏ అంశాలపై ఆర్టికల్స్ సవరించారంటే?
గౌతమ్ అదానీ, ప్రీతి అదానీ (అదానీ సతీమణి), కరణ్ అదానీ (కొడుకు), ప్రణవ్ అదానీ (అల్లుడు), అదానీ గ్రూప్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తదితర పేర్లతో ఉన్న ఆర్టికల్స్‌ను మ్యానిప్యులేట్ చేసినట్టు ‘సైన్‌పోస్ట్’ వెల్లడించింది.