మక్తల్, అక్టోబర్ 3 : ముకుపచ్చలారని పసికందును విక్రయించగా.. నిలదీసిన తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. మక్తల్ మండలం జక్లేర్ శివారులోని హైవేకు సమీపంలో ఈ నెల ఒకటిన మహిళ మృతదేహం ఉన్నదని పోలీసులకు సమాచారం అందింది. సీఐ రామ్‌లాల్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని దర్యా ప్తు ప్రారంభించగా శిశువును అమ్మి, తల్లిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సంచార జాతికి చెందిన లక్ష్మణ్ మొదటి భార్య మృతి చెందగా.. ఏపీలోని మంత్రాలయం ప్రాంతానికి చెందిన యశోదను రెండో వివాహం చేసుకుని మక్తల్ మండలం గుడిగండ్లలో జీవనం కొనసాగిస్తున్నారు. యశోద సెప్టెంబర్ 7న మగశిశువుకు జన్మనివ్వగా లక్ష్మణ్ ఆటోలో భార్య, బిడ్డను మరికల్ పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు.
లక్ష్మణ్‌తో సన్నిహితంగా ఉండే కొండమ్మ నవజాత శిశువును ముండ్లపొదల్లో పడవేయాలని అంటుండగా.. దవాఖానలో ఒప్పంద కార్మికురాలిగా పనిచేస్తున్న వసంత విషయం విన్నది. వారి వద్దకు వెళ్లి శిశువును పాడేయవద్దని.. మహబూబ్‌నగర్‌లో ఉండే తన అక్క ఉమాదేవికి పిల్లలు లేరని వారికి ఇవ్వాలని కోరింది. అంబులెన్స్ డ్రైవర్ ఖదీర్ సాయంతో రూ.60 వేలకు ఒప్పందం కుదుర్చుకోగా లక్ష్మణ్ తన భార్యను ఒప్పించి శిశువును ఉమాదేవికి అప్పగించాడు.
వారం తర్వాత శిశువుకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిపాలు అవసరమని ఉమాదేవి అంబులెన్స్ డ్రైవర్‌కు సూచించింది. దీంతో అతడికి పరిచయం ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన ఖదీర్‌కు పిల్లలు లేకపోవడంతో రూ.90 వేలకు విక్రయించాడు. ఏఎన్ఎం వెంకటేశ్వరమ్మ, అంబులెన్స్ డ్రైవర్‌తోపాటు సిబ్బంది కృష్ణవేణికి రూ.30 వేలు అందజేసి, కొండమ్మ రూ.30 వేలు తీసుకున్నది. తన బిడ్డను విక్రయించిన సొమ్ము ఎక్కడికి పోయిందని యశోద నిలదీయడంతో లక్ష్మణ్ భార్యను బండరాయితో మోది హత్య చేసి పరారయ్యాడు.