Chargesheet : భర్తను మధ్యప్రదేశ్ (Madhyapradesh) నుంచి హనీమూన్ (Honeymoon) పేరుతో మేఘాలయ (Meghalaya) కు తీసుకెళ్లి హత్య చేయించిన ఘటన మూడు నెలల క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తు కోసం మేఘాలయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 790 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ఈ చార్జిషీట్లో హతుడి భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా సహా ఐదుగురు నిందితులపై పోలీసులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆ ఐదుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు అందిన తర్వాత మరో ముగ్గురు సహ నిందితులపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సిట్ వెల్లడించింది.
సోనమ్‌ను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. హత్య అనంతరం 17 రోజులపాటు సోనమ్ దాగివున్న భవన యజమానిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన తర్వాత కోర్టు ఈ కేసులో తదుపరి విచారణ జరపనుంది. కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. ఈ ఏడాది మే 11న అతడికి సోనమ్‌తో వివాహం జరిగింది.
ప్రియుడి కోసం భర్త హత్యకు ప్లాన్ చేసిన సోనమ్ రఘువంశీ.. మే 20న హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లింది. అక్కడ మే 22న రాజా రఘువంశీని ప్రియుడి స్నేహితులతో హత్య చేయించింది. అనంతరం నిందితులు ఇండోర్ వచ్చి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. సోనమ్‌ను ఆమె ప్రియుడు కుశ్వాహా ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. హనీమూన్‌కు వెళ్లిన కొడుకు, కోడలు తిరిగి రాకపోవడంతో రఘువంశీ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు.
ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత అంటే జూన్ 1న సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోగల లోతైన లోయలో పోలీసులు రాజారఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా ఉన్నట్టుండి జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ఎవరో తన కిడ్నాప్ చేసి ఘాజీపూర్‌లో వదిలివెళ్లినట్లు నాటకం ఆడింది.
కానీ పోలీసులు అప్పటికే తమకు లభించిన ఆధారాల ఆధారంగా తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం ఒప్పుకుంది. ప్రియుడితో కలిసి తానే తన భర్తను హత్య చేయించినట్లు చెప్పింది. దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుశ్వాహా, ఇతర నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 11న నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపర్చగా కస్టడీకి పంపింది. తాజా ఈ కేసులో చార్జిషీట్ దాఖలైంది.