జగిత్యాల టౌన్, మార్చి 20 : జగిత్యాల జిల్లాకేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులే శ్మశాన వాటికలో వదిలేయడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. స్థానికులు అతడిని ఏరియా దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్నారు. జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ ఐదేండ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. కొంతకాలం బాగానే పనిచేశాడు. అక్కడ ఉన్నప్పుడే కిడ్నీకి సంబంధించిన వ్యాధి రావడంతో మూడు నెలల క్రితం జగిత్యాలకు తిరిగి వచ్చాడు.
ఇక్కడ ఓ దవాఖానలో పరీక్షలు చేయించుకోవడంతో రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని వైద్యులు తెలిపారు. చికిత్సకు డబ్బులు లేకపోవడం, అద్దెకు ఉంటున్న ఇంటిని ఓనర్ ఖాళీ చేయాలని చెప్పడంతో ఆయన భార్య.. శ్రీధర్‌ను సమీపంలోని చింతకుంట శ్మశాన వాటికలో వదిలేసింది. తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానికులు చలించిపోయారు. శ్రీధర్‌ను 108 వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.