హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): శుభం పలకరా పెండ్లి కొడకా అంటే.. పెండ్లికూతురు ఎక్కడ చచ్చింది అన్నాడట ఎనకట ఎవరో ప్రబుద్ధుడు. రాష్ట్రంలో బీజేపీ నాయకుల వైఖరి అట్లానే ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలివిగా ఫిర్యాదుచేసి.. భాషతో గడబిడచేసి.. పదాల పితలాటకంతో దళితబంధును ఆపించారు. మేమే తెలివిగలోళ్లం.. అన్నట్టుగా ఫిర్యాదుచేసి ప్రతిష్ఠాత్మక పథకానికి మోకాలడ్డారు. ఇప్పుడు దళిత సమాజం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో.. ‘అబ్బే మేం ఆపాలని చెప్పనే లేదు. మీకు అసలు ఇంగ్లీషు వస్తదా? చదువుకున్నరా?’ అంటూ సుద్దపూసల్లా కారడ్డం మాటలు మాట్లాడుతున్నారు. ముక్కేడున్నదిరా.. అంటే తిప్పి తిప్పి చూపినట్టు.. తిప్పి తిప్పి చెప్తే.. అర్థం చేసుకోలేనంత తెలివిలేని సమాజం కాదు తెలంగాణ. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో జీ ప్రేమేందర్‌రెడ్డి అక్టోబర్ 7, 2021న.. బీజేపీ రాష్ట్ర కార్యాలయమైన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్, కట్టెలమండి, హైదరాబాద్-500001 చిరునామా కలిగిన లెటర్‌హెడ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్చంద్రకు లేఖ రాశారు. మిగతా ఇద్దరు కమిషనర్లు రాజీవ్‌కుమార్, అనూప్ చంద్రపాండేతోపాటు సీఈసీ ముఖ్య కార్యదర్శి అవినాశ్‌కుమార్‌కు కూడా లేఖను పంపించారు. లేఖలో విషయం (సబ్జెక్ట్) దగ్గరేమో.. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ల బదిలీ కోరుతున్నట్టుగా బోల్డ్ లెటర్లలో పేర్కొన్నారు. లేఖలోని రెండో పేజీలోని మూడో పేరాలో దళితబంధు ప్రస్తావన తెచ్చారు. ఆ పేరాలో ఏం పేర్కొన్నారో యథాతథంగా..
‘The District Collector and Magistrate, Karimnagar District who is the competent officer for disbursement of funds allotted by the Government towards Dalit Empowerment Scheme popularly known as DALITHA BANDHU is intentionally not disbursing the same to the eligible dalit families though they have completed all the formalities as required by the Government and is intentionally kept them on hold to deposit the same into the accounts of the eligible families only before 3 or 4 days before the polling date i.e., 3O.IO.2021 in order to influence the voters and gain benefit for the candidate set-up by the party ruling the present government of the day.’
దీనిని తెలుగులో తర్జుమా చేస్తే.. ‘దళితబంధుగా అందరికీ తెలిసిన దళిత సాధికారత స్కీం కింద ప్రభుత్వం కేటాయించిన నిధులకు అధికారి అయిన కరీంనగర్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్.. ఉద్దేశపూర్వకంగానే అర్హత కలిగిన కుటుంబాలకు, వారు అన్ని లాంఛనాలు పూర్తి చేసినప్పటికీ నిధులు పంపిణీ చేయడంలేదు. ఈ నిధులను పోలింగ్ తేదీ అయిన 30-10-2021 కి రెండు మూడు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలో జమచేసి ఓటర్లను ప్రభావితం చేసి.. అధికార పార్టీ అభ్యర్థికి మేలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.’
ప్రేమేందర్ లేఖలోని ఈ మాటల అర్థం.. ఆంతర్యం ఏమిటి? లేఖకు ముందు సబ్జెక్ట్ కాలమ్‌లో ఆయన రాసిందేమిటి? మధ్యలో ఈ పేరా ఎందుకు వచ్చింది? దళితులకు మేలు చేయాలని.. దళితబంధు తప్పనిసరిగా అమలుకావాలని బీజేపీ నేతలు నిజంగా భావించి ఉన్నట్టయితే.. అసలు అధికారుల బదిలీ కోరుతూ రాసిన లేఖలో.. దళితబంధును ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమేమొచ్చింది? ‘పోలింగ్‌కు రెండుమూడు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని ఫిర్యాదు చేయడం ద్వారా చెప్పదలచుకున్నది.. పథకం అమలును ఆపాలని కాదా? ఏ ఒక్కరిని అడిగినా ఇదే విషయాన్ని చెప్తారు. పదాల గజిబిజిలో అంతర్లీనంగా (బిట్వీన్ ది లైన్స్ అంటారు లెండి..) బీజేపీ వాళ్లు చెప్పదలచుకున్నది స్పష్టమే కదా! అదేదో సినిమాలో విలన్ పాత్రధారి ‘నాకు అతడిపై విరక్తి కలిగింది’ అంటాడు. వెంటనే విలన్ అనుచరులు అతడిని చంపేస్తారు. బీజేపీ వాళ్ల మాటల తీరు వెనుక అసలు ఆంతర్యం ఇదే. కేంద్రంలో ఎన్నికల సంఘం ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నదో తెలంగాణలోనే కాదు.. దేశమంతా తెలిసిన విషయమే కదా..
గమ్మత్తేమిటంటే.. హుజూరాబాద్ నియోజకవర్గానికి నిధుల విడుదల అన్నది నోటిఫికేషన్ రావడానికి ఎన్నో రోజుల ముందు జరిగింది. అధికశాతం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి కూడా. యూనిట్ల గ్రౌండింగ్ కూడా మొదలైంది. మిగిలిన కొద్దిమంది లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం మాత్రమే మిగిలింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. ఫలితాల అనంతరం ఆ కుటుంబాలకు కూడా జమవుతాయి. ఇందులో కొత్తగా డబ్బులిచ్చేదేమున్నదో ప్రేమేందర్రెడ్డికే తెలియాలి! యూనిట్ల ఎంపిక, పంపిణీ మాత్రమే మిగిలిందన్న నిజం తెలియకపోవడం కూడా బీజేపీ నేతల ఉద్దేశపూర్వకమే.
దళిత సాధికారత పథకానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 18న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే నిధులను కేటాయించింది. అసెంబ్లీలో ఆమోదాన్ని కూడా పొందింది. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్ కంటే ముందే ఆగస్టు 4నే వాసాలమర్రిలోనే పథకం అమలు ప్రారంభమైంది. ఆగస్టు 16న హుజూరాబాద్‌లోనూ, ఆ తర్వాత రాష్ర్టానికి నలువైపులా ఉన్న నాలుగు ఎస్సీ నియోజకవర్గాలోని నాలుగు మండలాల్లో అమలుకు శ్రీకారం చుట్టింది. హుజూరాబాద్‌లో పథకం అమలుకు 2 వేల కోట్ల నిధుల విడుదల ఆగస్టు 26 నాటికి పూర్తయ్యింది. అప్పటికి ఉప ఎన్నిక షెడ్యూలు కూడా రాలేదు.
క్రమానుగతంగా రాష్ట్రమంతటా అమలవుతున్న పథకానికి హుజూరాబాద్ ఎన్నికలతో సంబంధం ఏమిటి? పథకాన్ని ఎన్నికలతో ముడిపెట్టి.. పోలింగ్‌కు ముందు నిధులను కలెక్టర్ జమచేస్తారని బీజేపీ నేతలు చెప్పడం వెనుక లక్ష్యమేమిటి? చెప్పనట్టే చెప్పి దళితబంధును ఆపించారు. తీరా తమ ఎత్తుగడ అడ్డంతిరిగి దళిత సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతుండటంతో ఒకరి తర్వాత ఒకరు ఒట్లు.. దండాలు.. మొక్కుల సవాళ్లు విసురుతున్నారు. దేవుళ్ల గుళ్లకు రావాలంటూ బీరాలు పలుకుతున్నారు. బీజేపీ నేతల అబద్ధాలకు అంతెన్నడు? రోజురోజుకూ తమ ఓటమి స్పష్టం అవుతుండటంతో రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని కూటనీతితో దళితుల నోటికాడ బువ్వ ఎత్తగొట్టారు.. బీజేపీ నేతలు నిస్సిగ్గుగా బరిబాతల దొరికిపోయి.. ఇప్పుడు అయ్యయ్యో.. మేం ఏమీ చేయలేదు.. తడిగుడ్డలు కట్టుకుంటాం.. ప్రమాణాలు చేస్తాం.. అంటూ గుమ్మడికాయల దొంగల్లాగా భుజాలు తడుముకొంటున్నారు. కానీ.. హుజూరాబాద్ ఓటర్ల చైతన్యాన్ని బీజేపీ నేతలు తక్కువ అంచనా వేస్తున్నారు. వీరి నిజస్వరూపం ప్రజలకు ఇప్పటికే బాగా అర్థమైంది. వీరి నీచ రాజకీయాలకు కర్రుకాల్చి వాత పెట్టడమెలాగో ప్రజలకు బాగా తెలుసు.