హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేండ్లు కావస్తున్నా, బడ్జెట్ కేటాయింపులు పెరిగినా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వారి బకాయిలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటివరకు రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇంకా రూ.45 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పేరుకుపోయినట్టు సర్కార్ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు.
వారికి రావాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు సకాలంలో అందడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ఉద్యోగుల జేఏసీ లెకల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాటికి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కలిపి రూ.14,200 కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఉద్యోగులకు రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. డీఏల రూపంలోనే ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బాకీ పడినట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇదే అదునుగా మధ్యవర్తులు రాజ్యమేలుతున్నారని, 10 శాతం కమీషన్ ఇస్తేనే తమ బకాయిలు విడుదల చేస్తున్నారని విశ్రాంత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తాతాలిక సిబ్బందికి కూడా రూ.2,000 కోట్లకుపైగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అంచనా. బకాయిల కోసం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు దిగాల్సి వస్తుండటం సర్కార్ వైఫల్యాన్ని చాటుతున్నది. దీనిపై ఉద్యోగులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ ప్రయోజనాల వివరాలను తెలియజేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు.. కాంట్రాక్టర్ల చెల్లింపులకు సంబంధించిన వివాదాల్లోనూ జోక్యం చేసుకున్నది. ఈ క్రమంలో బకాయిల చెల్లింపునకు ప్రతి నెలా రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయినప్పటికీ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు బకాయిల కోసం సచివాలయంలో నిత్యం ఆందోళనలకు దిగుతున్నారు.