‘ఆంధ్ర జనసంఘం’ పేరుతో మూడు సభలు నిర్వహించిన తర్వాత, 1930లో ‘ఆంధ్ర మహాసభ’ పేరుతో కార్యక్రమాలను విస్తరింపచేశారు. కానీ, నిజాం ప్రభుత్వం ఆజ్ఞానుసారం వర్తక సంఘాల సమస్యలు, రైతుల సమస్యలు, వెట్టిచాకిరి నిర్మూలన విషయాలను గూర్చి మాత్రమే మొదట్లో మాట్లాడేవారు. స్త్రీ విద్య, బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహం, మాతృభాషలో బోధన, వైద్యసేవలు వంటి విషయాల గూర్చి కూడా చర్చించేవారు.
1936లో నిజామాబాద్‌లో జరిగిన ‘ఆంధ్ర మహాసభ’లో మొట్టమొదటిసారిగా ‘ప్రజలకు రాజ్యాధికారం కావాలి’ అనే విషయం చర్చకు తెచ్చారు. దాంతో ఆంధ్ర మహాసభల్లో రాజకీయ అంశాలను కూడా చర్చించటం ఆరంభమైంది.
1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. అతివాదులు రావినారాయణరెడ్డి సారథ్యంలో కమ్యూనిస్టుపార్టీలో చేరారు. 1938లోనే నైజాంలో కాంగ్రెస్‌పార్టీ ఏర్పడింది. ఏర్పడిన కొంతకాలానికే నిషేధానికి గురైంది. నిషేధం తొలగించిన తర్వాత మితవాదులు రామానందతీర్థ నాయకత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ పునరుద్ధరింపబడింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రెండు కూడా కొంతకాలం నిజాం ప్రభుత్వం చేత నిషేధింపబడినాయి. ఆ కాలంలోనే కాంగ్రెస్‌లో అతివాద ధోరణులు ప్రవేశించాయి. ఆ కాలాన్ని నేపథ్యంగా చేసుకొని పీవీ నర్సింహారావు ‘గొల్ల రామవ్వ’ కథను రచించారు.
కమ్యూనిస్టు పార్టీ మీద ఆంక్షలు తొలగిపోయిన తర్వాత 1946 నుంచి ఆ పార్టీ పోరాటమార్గంలో పయనించి జాగీర్దార్లు, దొరల మీద పోరాటం ఎక్కుపెట్టింది. ఈ సాయుధ పోరాటాన్ని 1951 వరకు కొనసాగించింది. ఇదే ‘తెలంగాణ సాయుధ పోరాటం’గా చరిత్రకెక్కింది. రష్యాలో బోల్షివిక్ విప్లవం తర్వాత తెలంగాణ సాయుధపోరాటం ప్రపంచ ప్రసిద్ధి కెక్కింది.
రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మొదలైనవారు కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు.
తెలంగాణలో ప్రజలు ఉద్యమాలను నడుపుతున్న సమయంలో కొందరు ముస్లింలు 1926లో ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థను స్థాపించి ‘తబ్లీగ్’ (మతాంతీకరణ) చేయటం ఆరంభించారు. నాటి ప్రముఖ నేత బహదూర్ యార్ జంగ్ పేరును ఈ సంస్థ వారు వాడుకున్నారు. నైజాంలో హిందువుల జనాభా ఎక్కువ. ముస్లింల జనాభా తక్కువ. అందుచేత ఈ సంస్థవారు ముస్లిం జనాభాను పెంచే ఉద్దేశ్యంతో నిమ్నజాతి హిందువులను ముస్లింలుగా మతాంతీకరణ చేసేవారు. ఈ విషయాలను వట్టికోట ఆళ్వారుస్వామి తన ‘ప్రజల మనిషి’ నవలలో విశదంగా చిత్రించారు. ఈ మతాంతీకరణ సందర్భంలోనే ఉత్తర భారతం నుంచి ఆర్యసమాజం వారు వచ్చి ‘శుద్ధి’కార్యక్రమాలను చేపట్టి ఇస్లాం మతంలో చేరినవారిని తిరిగి హిందూమతంలోకి మార్చేవారు. అనంతరకాలంలో ఆర్యసమాజ్ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది. ఆర్యసమాజ్ ఉద్యమానికి వినాయకరావు విద్యాలంకార్, పండిట్ నరేంద్రజీ నాయకత్వం వహించారు. ఆర్యసమాజ్‌లో విగ్రహారాధన లేదు. గుడులకు పోయి పూజలు చేయటం లేదు. స్త్రీలకు పురుషులతో సమానంగా ప్రతిపత్తిని కల్పించారు. హేతువాద దృష్టితో ఆలోచించారు. అందుచేతనే రావినారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైన కమ్యూనిస్టు నాయకులు, కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు, సుద్దాల హనుమంతు, భాగ్యరెడ్డి వర్మ, దాశరథి, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి మొదలైన వాళ్లు ఎందరో ఆ రోజుల్లో ఆర్యసమాజ్ చేత ప్రభావితులైనారు. ఆ తర్వాత వారు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలలో చేరిన చరిత్ర ఉన్నది.
1940 ఆగస్టు 8న బహదూర్ యార్ జంగ్ నిజాం రాజ్యంలో తెలుగు ప్రాంతాలన్నీ కలిసిపోయి ‘ఉస్మానిస్తాన్’ అనే పేరుతో కొత్త దేశం ఏర్పడుతుందని బెజవాడలో ప్రకటించారు. బ్రిటిష్‌వారు దీన్నొక స్వతంత్ర దేశంగా ఏర్పరిచి వెళ్లిపోతారని కూడా ప్రకటించారు.
ఈ క్రమంలోనే కాశీం రజ్వీ ‘రజాకార్లు’ అనే సాయుధ ముఠాను ఏర్పాటు చేసి హిందువుల మీద దాడులు చేశాడు. ‘లాల్‌ఖిల్లా (ఎర్రకోట) మీద అసఫ్‌జాహీ జెండాను ఎగురవేస్తా’మని విర్రవీగేవాడు. 1948 నాటికి రజాకార్ల హింసాకాండ మితిమీరిపోయింది. ప్రజలను నానా హింసలకు గురిచేశారు. హిందువుల మానప్రాణాలు, ఆస్తులు కొల్లగొట్టారు. రజాకార్లు ప్రజలపై దాడులు చేసే వృత్తాంతాలను తీసుకొని అయోధ్య రామకవి ‘తెలంగాణ మంటల్లో’ అనే పేరుతో కథలు రాశారు. బైరాన్‌పల్లి ప్రజలు రజాకార్లను ఎదిరించిన వృత్తాంతాన్ని ‘అమరజీవి’ పేరుతో కె.ఎల్.నరసింహారావు ఓ కథ రాశాడు. ఒకవైపు రజాకార్ల హింసాకాండ పెచ్చరిల్లుతున్నా వారి చర్యలను నిజాం పరోక్షంగా సమర్థించాడు. ఎందుకంటే.. తన స్వతంత్ర రాజ్యానికి రజాకార్ వ్యవస్థ బాసటగా ఉంటుందని భావించాడు.
కమ్యూనిస్టు సాయుధ పోరాటం 1946-48 ప్రాంతంలో ఉధృతంగా నడిచింది. వారు భూస్వాముల మీద దాడి చేసి వారి భూములను ప్రజలకు పంచారు. వడ్డీ వ్యాపారులు, భూస్వాముల వద్ద కుదువబెట్టిన కాగితాలను తగులబెట్టారు. లెవీ ధాన్యం వసూళ్లను ఎదిరించారు. సామాన్య జనం మీద అణచివేతకు పాల్పడే దొరలను శిక్షించారు. దొరల గడీలను కూల్చారు. దీంతో సామాన్య ప్రజలు కూడా కమ్యూనిస్టుల పక్షంలో చేరి కట్టెలు, కొడవళ్లు, వడిసెలతో గడీల మీదకు దండయాత్రలు చేశారు.
ఈ కమ్యూనిస్టుల పోరాటాలను చిత్రిస్తూ చాలా కథలు వచ్చాయి. కథల కన్నా ఎక్కువగా నవలలు నాటి నుంచి నేటిదాకా రాయబడుతున్నాయి. దాదాపుగా ఇప్పటివరకు 15కు పైగా నవలలు వచ్చాయి. ఆవుల పిచ్చయ్య, కాంచనపల్లి చినవెంకట రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, అడ్లూరి అయోధ్య రామకవి, పొట్లపల్లి రామారావు మొదలైన వారెందరో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ప్రజల దీనగాథలను చిత్రి స్తూ కథలు రాశారు. నిజాం తన రాజ్యాన్ని స్వతంత్రదేశంగా ఉంచటానికి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ వరకు వెళ్లాడు. కానీ అతని ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం రాజ్యంపై పోలీస్ చర్య జరిగింది. నిజాం సైనికులుగాని, బ్రిటిష్ సైనికులుగానీ భారత సైన్యాన్ని ఎదుర్కోలేదు. ప్రతిఘటించిన రజాకార్లు మరణించారు. పోలీస్ చర్య ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైంది.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606