Metformin | మధుమేహ చికిత్సలో దశాబ్దాలుగా మెట్ ఫార్మిన్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. ముధుమేహ వ్యాధికి ఔషధంగా ఉపయోగిస్తున్న మెట్ ఫార్మిన్ అనే ఔషధం ఎలా పనిచేస్తుందనే విషయంలో తాజా పరిశోధన కొత్త కోణాన్ని వెల్లడించింది. ఇప్పటివరకు ఇది ప్రధానంగా కాలేయం (లివర్), పేగులపై పనిచేస్తుందని భావించినప్పటికీ, ఇది మెదడు మార్గాలను కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనం సూచిస్తోంది. Science Advances లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం మెట్ ఫార్మిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ నియంత్రణలో మెదడు కూడా ఒక ప్రధాన నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని వారు వెల్లడించారు.
ఇప్పటివరకు మెట్ ఫార్మిన్ లివర్‌లో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుందని భావించామని, కానీ మెదడు పాత్రపై కూడా దృష్టి సారించామని పరిశోధకులు వెల్లడించారు. పరిశోధకులు మెదడులోని ventromedial hypothalamus ప్రాంతంలో ఉండే Rap1 అనే ప్రోటీన్‌పై దృష్టి పెట్టారు. ఈ ప్రోటీన్ ఆకలి నియంత్రణ, గ్లూకోజ్ గుర్తింపు ప్రక్రియలో కీలకంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో Rap1 కార్యకలాపాన్ని తగ్గించినప్పుడు, మెట్ ఫార్మిన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసిందని వారు గుర్తించారు. ఈ ఫలితాలను నిర్ధారించడానికి Rap1 లేకుండా జన్యుపరంగా మార్పులు చేసిన ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఈ ఎలుకలకు మెట్ ఫార్మిన్ ఇవ్వగా రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పు కనిపించలేదు. అయితే ఇన్సులిన్ వంటి ఇతర ఔషధాలు మాత్రం ప్రభావం చూపించాయి. తర్వాత పరిశోధకులు మెట్ ఫార్మిన్ ను నేరుగా ఎలుకల మెదడులో ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరంగా, చాలా తక్కువ మోతాదులోనే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గించింది. ఇది మెదడు ఈ ఔషధానికి అధిక స్పందన చూపుతుందని సూచిస్తోంది.
అలాగే SF1 న్యూరాన్లు అనే ప్రత్యేక మెదడు కణాలు మెట్ ఫార్మిన్ ప్రభావంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తించారు. Rap1 ఉన్నప్పుడే ఈ కణాలు సక్రియమవుతున్నాయి. Rap1 లేని సందర్భంలో మెట్ ఫార్మిన్ ప్రభావం కనిపించలేదు. ఈ పరిశోధన మెట్ ఫార్మిన్ పని చేసే విధానంపై ఉన్న అవగాహనను పూర్తిగా మార్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లివర్ లేదా పేగులకే పరిమితం కాకుండా, మెదడులో కూడా ఇది ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా భవిష్యత్తులో మెదడును లక్ష్యంగా చేసుకునే కొత్త మధుమేహ చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన దారితీస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.