హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణకు మరే రాష్ట్రం సాటిరాదని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, పింఛన్లు వంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. అభివృద్ధి చేయడం చేతగాక, చేస్తున్న వారిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేస్తూ చిల్లర రాజకీయా లు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బు పెట్టి కొన్న పదవిలో ఒకరు, దిక్కు లేక పెట్టిన పదవిలో ఉన్న మరొకరు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.