కరీంనగర్ రూరల్/చొప్పదండి: ఏప్రిల్ 25: మరికొన్ని గంటల్లో అన్న వివాహ వేడు క.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ్ముడు, అతడి స్నేహితుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ శివారులో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండికి చెందిన మాచర్ల దినకర్-గంగ దంపతులకు ముగ్గురు కొడుకులు. ఆదివారం రెండో కొడుకు ఉదయ్‌కుమార్ వివాహం తిమ్మాపూర్‌లో జరిగింది. ఈ పెండ్లికి మధ్యప్రదేశ్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న మూడో కొడుకు అక్షయ్‌కుమార్ (24), స్నేహితులు మహబూబ్‌నగర్‌కు చెందిన భవానీశంకర్ (24), ఉప్పరి తరుణ్‌తో కలిసివచ్చారు.
సోమవారం చొప్పదండిలో వివాహ వేడుక ఉండగా అక్షయ్‌కుమార్, భవానీశంకర్, తరుణ్ కలిసి కారులో కూరగాయలు తెచ్చేందుకు తెల్లవారుజామున కరీంనగర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు, హార్వెస్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్షయ్‌కుమార్, భవానీశంకర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తరుణ్ తీవ్రంగా గాయపడగా కరీంనగర్ దవాఖానకు తరలించారు. కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.