మానవ నాగరికతకు తొలి మెట్టు అయిన వస్ర్తాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే తయారయ్యాయి. కానీ ఆ వస్ర్తాల వెనుక దాగి ఉన్న వారి జీవితం మాత్రం కష్టాలు, కన్నీళ్ల కథగానే మిగిలిపోతున్నది. ‘జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు’ అంటూ ఓ కవి చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి. ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నది.
తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో చేనేత వృత్తి తరతరాలుగా కొనసాగుతున్నది. తివాచీలు, బెడ్ షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ వంటి వస్ర్తాలను తయారు చేసి ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడంలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) కీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే దాదాపు 10 వేల చేనేత కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మరో 15 వేల కార్మిక కుటుంబాలు కూడా పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 60కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35కు పైగా మ్యాక్స్ సంఘాలు పనిచేస్తూ టెస్కోకు అవసరమైన కార్పెట్లు, బెడ్ షీట్లు, లివరీ వస్ర్తాలను తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆప్కో ద్వారా, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టెస్కో ద్వారా ప్రభుత్వ సంక్షేమ శాఖలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంజీపీటీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు అవసరమైన వస్ర్తాలను సరఫరా చేస్తూ ఈ వ్యవస్థ నడుస్తున్నది.
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సంబంధిత శాఖలు తమ అవసరాలను టెస్కోకు తెలియజేస్తాయి. అనంతరం ఆర్డర్లను చేనేత సహకార సంఘాలకు టెస్కో కేటాయిస్తుంది.ఆ సంఘాలు తమ సభ్యులతో కలిసి వస్ర్తాలను తయారు చేసి టెస్కోకు అందజేస్తాయి. ఈ విధానం ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (జీఐ) హక్కు పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తులు నాణ్యతకు ప్రతీకగా నిలిచాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సరఫరా వ్యవస్థలో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని టెస్కో తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నది. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రైవేట్ సంస్థలు ప్రవేశించి, వేలాది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రమాదమున్నది. తరతరాలుగా నూలుపోగులు అల్లుతూ జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే దుస్థితి తలెత్తుతుంది. ఇప్పటికే కరోనా కారణంగా చేనేత రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. మార్కెట్లు మూతపడి, ఆర్డర్లు తగ్గిపోయి, ఉపాధి దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా చాలామంది నేతన్నల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.
అద్భుతమైన నైపుణ్యంతో వస్ర్తాలు నేసిన కళాకారుల జీవితాలు నేడు కన్నీళ్ల కలబోతగా మారడం సమాజానికి బాధాకరం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా టెండర్ విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు జరగడం చేనేత కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లో 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ల విధానం నుంచి వరంగల్ కార్పెట్లు, బెడ్ షీట్లను తొలగించి, పాత పద్ధతి ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అమల్లోకి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కొనసాగుతుంది. చేనేత పరిశ్రమ కూడా నిలుస్తుంది.
చేనేత అనేది వృత్తి మాత్రమే కాదు – ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళ. చేనేత పరిశ్రమను కాపాడి వేలాది మంది నేతన్నల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. టెండర్ విధానాన్ని రద్దు చేయాలని యావత్తు తెలంగాణ చేనేత కళాకారులు గొంతెత్తి నినదిస్తున్నారు.