హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేపచెట్లు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం వంటి కారణాలపై ములుగులోని ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం మొదలు పెట్టామని ఆ కాలేజీ డీన్ వీ కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2021లో ఎఫ్సీఆర్ఐ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ఈ లక్షణాలు గమనించడంతో ఈ సమస్యపైన కాలేజీ ఆధ్వర్యంలో పరిశోధన ప్రారంభించినట్టు తెలిపారు.
వేపచెట్లకు వచ్చే డైబ్యాక్ వాధికి గల కారణంపై ప్రాథమికంగా చేసిన పరిశీలనలో ‘ఫోమాస్పిస్ అజాదిరాక్టీ’ అనే శీలింద్రం (ఫంగస్)పై లోతైన అధ్యయాన్ని ప్రారంభించామని వెల్లడించారు. వేపచెట్టు పర్యావరణకు మూలస్తంభం మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. దీనిని రక్షించడం శాస్త్రీయమైన బాధ్యతతోపాటు సాంస్కృతిక కర్తవ్యమని వెల్లడించారు. అందువల్ల ఈ వ్యాధిపై లోతుగా అధ్యయనం చేసి, శాశ్వతంగా నిర్మూలిస్తామని తెలిపారు.