హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో బాగుందని, గ్రామాల్లో పాఠశాలలు మెరుగుపడే అవకాశం కలిగిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టి స్కూళ్లలో ఒక్కో తరగతికి ఒక్కో గది ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బడ్జెట్‌పై చర్చలో గురువారం శాసనమండలిలో నర్సిరెడ్డి మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి అయ్యే ఖర్చును పెంచాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీలు, వైద్య రంగాలకు బడ్జెట్ పెంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని, ధరణిలో లోపాలను సవరించాలని కోరారు. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు, బీసీబంధును కూడా ప్రవేశపెట్టాలని నర్సిరెడ్డి కోరారు.