e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News మన గెల్లును గెలిపించుకుందాం

మన గెల్లును గెలిపించుకుందాం

స్వరాష్ట్రం కోసం ఎన్ని వ్యూహాలు పన్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశ పటంలో సమున్నతంగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంతకంటే ఎక్కువే కష్టపడుతున్నారు. తెలంగాణను ఆర్థికరంగంలో సమున్నతంగా నిలబెట్టడానికి వ్యవసాయిక, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్నారు.

విదేశీ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేవిధంగా వనరులు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కంచంలోకి బువ్వ పోయేట్టుగా సంక్షేమ పథకాలుంటున్నాయి. ఇంటిదొంగలు, వలస పాలకులు, వాళ్ల పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినట్టే.. తెలంగాణ అభివృద్ధి విషయంలోనూ ప్రతిపక్షాలు, వలసవాద, జాతీయపార్టీలు, స్వపార్టీ నమ్మకద్రోహులు అడ్డుపుల్లలు వేస్తున్నా ఎదుర్కొంటూ రాష్ర్టాన్ని పురోగామి దిశలో పరుగులెత్తిస్తున్నారు కేసీఆర్‌.

- Advertisement -

ఇలాంటి సమయంలో, దాదాపు రెండు దశాబ్దాలు తనకు ఉన్నత స్థానం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఓ జాతీయపార్టీలో చేరిన వ్యక్తి వల్ల హుజూరాబాద్‌ ఉపఎన్నిక వచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీ పూర్వరంగమున్న ఓ వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. ఓ అధికారి తన పదవికి రాజీనామా చేసి మరో పార్టీలో చేరాడు. వీళ్లంతా దళితబంధు లాంటి అద్భుత పథకాలను కూడా విమర్శిస్తూ హుజూరాబాద్‌ ఎన్నికలో గెలవాలని చూస్తున్నారు. తాము గెలిస్తే గత ఏడేండ్లుగా కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న పనుల కంటే మెరుగ్గా ఏం చేస్తారు? ఏ విషయంలోనూ వాళ్ళకు స్పష్టత లేదు.


స్వాతంత్య్రానంతరం ఆరున్నర దశాబ్దాలు తెలంగాణ సాయుధపోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం, నక్సలైట్ల భూ పోరాటాలు, తెలంగాణ రాష్ట్ర పోరాటాలతో తెలంగాణ నేల రక్తసిక్తమైంది. గత ఏడేండ్ల స్వపరిపాలనలో ఈ పరిస్థితి మారింది. తెలంగాణలో శాంతి, అభివృద్ధి నెలకొన్నాయి. తెలంగాణ ఆత్మను, అణువణువును ఎరిగిన కేసీఆర్‌ నాయకత్వంలో.. సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా, పచ్చదనంలో ప్రథమస్థానంలో, వ్యవసాయ గ్రామీణాభివృద్ధిలో నెంబర్‌వన్‌గా ఉంది. తెలంగాణ వ్యతిరేకులు తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేసిందేమీలేకున్నా నడిచే ఎద్దునే పొడిచినట్టు పనిచేస్తున్న ప్రభుత్వంపైన్నే విరుచుకుపడ్తున్నారు. తెలంగాణలో యాభై ఏండ్లలో జరుగని అభివృద్ధి, మౌలికమార్పులు ఈ ఏడేండ్లలో జరిగినా.. మిగిలి ఉన్న కొన్ని విషయాలను పట్టుకొని కువిమర్శలు చేస్తున్నారు. ఆయాపార్టీల్లో తమ పరిస్థితి కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉందని వీరికి తెలియంది కాదు.

ఈ పార్టీల, నాయకుల అత్యుత్సాహాన్ని, అత్యాశను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ కూడా ఈ ఎన్నికను ఓ సవాలుగానే తీసుకున్నారు. నిజానికి ఈ అసెంబ్లీ ఉపఎన్నిక కోసం టీఆర్‌ఎస్‌ ఇం తగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదివరకే అమలుపరుస్తున్న అనేక పథకాలు, ప్రాజెక్టులు, పండుగలా మారిన వ్యవసాయం, పారిశ్రామిక కారిడార్లు, కులవృత్తుల పునర్వైభవం, ప్రకృతి సంరక్షణ, పచ్చదనం కేసీఆర్‌ను ఉత్తమ పాలకుల్లో, ముందువరుసలో నిలబెడ్తున్నాయి. వీటితోనే ఇంకో పదేండ్లపాటు గెలువవచ్చు. కానీ ప్రజల కోసమే ఎల్లప్పుడూ ఆలోచించే కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. రైతుబంధులా ఇది తెలంగాణలో శాశ్వత పథకంలా ఉంటుందన్న వాస్తవాన్ని కాంగ్రెస్‌, బీజేపీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీటన్నిటినీ తట్టుకొని ఈ ఎన్నిక గెలువడం కష్టం కాబట్టే అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.

దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాబోయే విజయాలన్నీ తమవేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠమూ తమదేనని ప్రగల్భాలు పలికింది. కానీ, ఆ తర్వాత జరిగిన నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో ఏం జరిగింది? చివరి స్థానానికి నెట్టబడింది. టీఆర్‌ఎస్‌ సమీపంలోకి కూడా రాలేకపోయింది. ఇప్పుడూ అదే జరుగుతుంది. అయినా టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికను తేలికగా తీసుకోవడం లేదు. చిన్నపామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్న సూత్రాన్ని పాటిస్తున్నది. ఎందుకంటే, బీజేపీ గెలిస్తే నమ్మకద్రోహాన్ని ప్రోత్సహించినట్టవుతుంది.

అయినా బీజేపీ ఎలా ఓట్లడుగుతుంది?
కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంస్థలన్నిటినీ అమ్ముతూ లక్షలాది ఉద్యోగులను రోడ్లపై నిలబెడుతున్నందుకా? తాను ఏడేండ్లు మంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్దేశించిన డబుల్‌ బెడ్రూములను ఒక్క గ్రామంలోనూ కట్టని నిర్లక్ష్యానికి మెచ్చి ఓట్లేసి గెలిపిస్తారా? బీసీ అని చెప్పుకొంటున్నా.. బీసీల పక్షం ఎన్నడు వహించాడని ఓటేస్తారు? వాస్తవానికి బీసీలందరూ ఏదో పథకం ద్వారా ప్రభుత్వం నుంచి లాభపడినవారే కదా!

రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినట్టే భావిస్తున్నది కాంగ్రెస్‌. ఆరు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చాయా? తెలంగాణ రైతులను, చేనేత కార్మికులను, ఇంకా అనేకమందిని ఆత్మహత్యల నుంచి కాపాడాయా? టీడీపీ నీడగా వస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణను మరోసారి వలస పాలకులకు అప్పగించకుండా ఉండగలడా? అంతఃకలహాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ను ఈ ఉప ఎన్నికలో ఎవరు నమ్ముతారు? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా వస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలను అనుభవిస్తూ, ఆత్మగౌరవాన్ని అనుభవిస్తూ.. తెలంగాణను ఢిల్లీకి తాకట్టు పెట్టడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణలో జరుగుతున్న వృత్తి పారిశ్రామిక విప్లవాన్ని చూస్తూ ఏ వృత్తి కులాలవారైనా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించకుండా ఉంటారా? దళితబంధుతో తమ బతుకుల్లో వెలుగును చూసుకుంటూ ఏ దళితుడు మాత్రం కేసీఆర్‌కు ఓటేయకుండా ఉంటారు? ఏ విధంగా చూసినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం.

తెలంగాణ వ్యతిరేకులు తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేసిందేమీలేకున్నా నడిచే ఎద్దునే పొడిచినట్టు పనిచేస్తున్న ప్రభుత్వంపైన్నే విరుచుకుపడ్తున్నారు. తెలంగాణలో యాభై ఏండ్లలో జరుగని అభివృద్ధి, మౌలికమార్పులు ఈ ఏడేండ్లలో జరిగినా.. మిగిలి ఉన్న కొన్ని విషయాలను పట్టుకొని కువిమర్శలు చేస్తున్నారు.

డాక్టర్‌ కాలువ మల్లయ్య
91829 18567

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement