తాంసి(భీంపూర్ ) : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా భీంపూర్ మండలం ధనోర నుంచి కరంజి (టీ) వరకు ఉన్న ప్రధాన రహదారి( HIghway ) గుంతల మయంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల ప్రజల అవస్థలను గమనించిన బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) సమస్యను బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ( MLA Anil Jadav ) విన్నవించారు.
భారీ వర్షాలు పడుతున్న సమయంలో రోడ్లు చిత్తడిగా మారి ప్రమాదాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే తాత్కాలిక మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరితో శుక్రవారం భీంపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మేకల నాగయ్య యాదవ్, స్థానిక నాయకులతో కలిసి మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానికులు రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. శాశ్వతంగా బీటీ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంజీవ్ రెడ్డి, కపిల్ యాదవ్, కునరపు అశోక్ యాదవ్, మనీష్ యాదవ్, నారాయణ, స్వామి,బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.