వాళ్లంతా నడి వయస్సు నుంచి 90ఏళ్లు పైబడినవారు.. ఇప్పటికీ సింహాల్లా ‘పోటీ’ పడుతున్నారు.. చిరుతల్లా పరుగుతీస్తున్నారు.. లేళ్లలా దుంకుతున్నారు.. పరుగు పందెం, లాంగ్‌జంప్, హైజంప్.. షాట్‌పుట్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో.. ఇలా ఆట ఏదైతేనేమి.. అవలీలగా ఆడేస్తున్నారు.. మూడు పదుల వయసు కూడా రాకముందే ‘తెల్లెల్కను చూసి ఎల్లెల్కల పడేటోళ్లు’ నోరెళ్లబెట్టేలా అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతున్నారు. హనుమకొండలోని జేఎన్ఎస్లో 8వ రాష్ట్ర వెటరన్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ శనివారం అట్టహాసంగా మొదలవగా పలువురు వృద్ధ క్రీడాకారులు ‘ఔరా’ అనిపించేలా తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కలిసి క్రీడోత్సవాన్ని ప్రారంభించగా వెటరన్ అథ్లెట్లు ఆకాశమే హద్దుగా పోటీల్లో పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 26: హనుమకొండ జేఎన్ స్టేడియంలో 8వ రాష్ట్ర వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. ఆరు నుంచి తొమ్మిది పదుల వయస్సులోనూ యువకుల వలె పరుగుపెడుతూ కనిపించారు. తిలకించేందుకు వచ్చిన క్రీడాభిమానులు కేరింతలు, చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఒక్కో ఈవెంట్లో వృద్ధ ఆటగాళ్లు ప్రతిభ చూపి మాస్టర్స్ గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు.
పతకాల పంట..
మొత్తం 13 ఈవెంట్స్‌కు గాను శనివారం 10 ఈవెంట్స్ నిర్వహించగా 600 మంది పాల్గొన్నారు. ఇందులో 79 గోల్డ్‌మెడల్స్ (55-మెన్స్, 24-ఉమెన్స్), 52 సిల్వర్ మెడల్స్(32-మెన్స్, 20-ఉమెన్స్) 38 బ్రాంజ్‌మెడల్స్ (25-మెన్స్, 13-ఉమెన్స్) సాధించినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ కురాకుల భారతి తెలిపారు. 5వేల మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, 500 కేఎం వాక్, షాట్‌పుట్, 800, 100 మీటర్స్, ట్రిపుల్ జంప్, డిస్కస్‌త్రో, 400 మీటర్స్, హైజంప్ నిర్వహించగా అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
క్రీడలంటే చాలా ఇష్టం
నాకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆటలు ఆడడం నా హాబీ. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ చేస్తాను. ఆర్మీ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. 5, 21 కిలోమీటర్ల పరుగుపందెంలో ఇప్పటికీ ఉత్సాహంగా పాల్గొంటా. నాకు ముగ్గురు పిల్లలు. 59 సంవత్సరాల్లో 5వేల మీటర్ల రన్నింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి యువతలో స్ఫూర్తి నింపేందుకు పోటీల్లో పాల్గొన్నా. ప్రతిరోజు రన్నింగ్, వ్యాయామం తప్పకుండా చేయాలి.
– జి.నారాయణ, హైదరాబాద్(59 ప్లస్)
50 గోల్డ్‌మెడల్స్ సాధించా..
లాంగ్‌జంప్, షాట్‌పుట్ 90ప్లస్‌లో బంగారు పతకాలు సాధించాను. నాలుగుసార్లు రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్నా. ఇప్పటివరకు 50గోల్డ్‌మెడల్ సాధించా. మాది గీసుకొండ. ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుల ఆలిండియా అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. రన్నింగ్, వ్యాయామం తప్పకుండా చేస్తా. నేటి యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఆరోగ్యానికి కాపాడుకునేందుకు క్రీడల్లో పాల్గొనాలి.
– బీ శ్రీనివాస్‌రెడ్డి(90ప్లస్)
ప్రతిరోజూ వ్యాయామం చేస్తా..
మాది ఖిలా వరంగల్ పడమరకోట. ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ చేస్తా. 45 ఏండ్ల నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తున్నా. 5 కేఎం రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించా. 100, 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటా. ఇప్పటివరకు మూడు గోల్డ్‌మెడల్స్ సాధించా.
– కత్తెరశాల కొమురయ్య (95ప్లస్)
సంతోషంగా ఉంది..
5కేఎం రన్లో గోల్డ్‌మెడల్ సాధించా. స్టేట్ ఫస్ట్ వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇతర క్రీడాకారులకు వెటరన్ అథ్లెట్లు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారిని చూసి మరింతగా ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలి. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో పాల్గొనాలి.
– డాక్టర్ దరావత్ విమల (49ప్లస్)