వరంగల్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండలోని తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ట్రాన్స్‌కో) భూములకు కబ్జా ముప్పు తప్పింది. ఉన్నతాధికారుల సత్వర చర్యలు, స్థానిక అధికారుల పర్యవేక్షణతో ట్రాన్స్‌కోకు చెందిన దాదాపు 10 ఎకరాల భూమి శాశ్వతంగా పదిలమైంది. ట్రాన్స్‌కో కార్యాలయ ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తయింది. రెవెన్యూ రికార్డుల ఆధారంగా ట్రాన్స్‌కో భూమిలో నిర్మాణాలు చేపట్టిన వారికి శుక్రవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. ట్రాన్స్‌కో ప్రహరీకి ఆనుకుని ఉన్న భారీ నిర్మాణాలు సైతం అక్రమ కట్టడాలే అని రెవెన్యూ శాఖ సర్వేలో తేలినట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్-ములుగు హైవే రోడ్డు ఆనుకుని ప్రహరీ లేని ప్రాంతం నుంచి పొక్లెయినర్లను తీసుకువెళ్లి సబ్‌స్టేషన్ భూమిలో చెట్లు పెరిగిన ప్రాంతాన్ని చదును చేశారు. ‘కరంటోళ్ల భూములపై కన్ను’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం ప్రచురితమైంది. ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు వెంటనే స్పందించి భూముల పరిరక్షణకు పకడబ్బందీ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు, హనుమకొండలోని అధికారులను ఆదేశించారు.
పోలీసు కమిషనర్, హనుమకొండ కలెక్టర్‌తోనూ ఈ విషయంపై స్వయంగా మాట్లాడి ట్రాన్స్‌కో భూములు కబ్జా కాకుండా సహకరించాలని కోరారు. కబ్జాను అడ్డుకునేందుకు మొదట వరంగల్-ములుగు హైవే వైపు ప్రహరీ లేని చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో ట్రాన్స్‌కో చీఫ్ ఇంజినీర్ జీ పుల్లయ్య, ఎస్ఈలు బీ శ్రీనివాసులు, బీ శ్రీధర్, డీఈ రాజానాయక్ తదితరుల పర్యవేక్షణలో ప్రహరీ నిర్మాణం పూర్తయింది.