వరంగల్, నవంబర్ 15: కాలనీల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని పలు కాలనీలకు చెందిన ప్రజలు కమిషనర్ ప్రావీణ్యకు విన్నవించారు. వినతులు అందజేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బల్దియా గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం జరిగింది. కమిషనర్ ప్రావీణ్య పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు, పారిశుధ్యం, కలుషిత తాగునీటి సమస్య, నల్లా లేకున్నా పన్ను విధింపు వంటి సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. మళ్లీ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన వినతులే ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని పలువురు ఫిర్యాదు చేశారు. వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఎల్వీఆర్ నగర్లో దశాబ్ధకాలంగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నామని, ఇంటి పన్నులు చెల్లిస్తున్నా కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయాలని, నల్లా కనెక్షన్లు ఇవ్వాలని గుడిసెకాలనీ వాసులు వినతిపత్రం అందచేశారు. శాయంపేట జాగీర్‌లోని సర్వే నంబర్ 306/ఏలో స్థలాన్ని కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించారని, వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని స్థానికుడు ఉపేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
హనుకొండ రాంనగర్‌లోని ఇంటి నంంబర్ 2-4-600 వద్ద రోడ్డు ఆక్రమించి నిర్మించడంతో రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుడు కృష్ణ ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ వరంగల్ బస్‌స్టేషన్ వద్ద ప్రజా మరుగుదొడ్లు నిర్మాణానికి వర్క్ అర్డర్ ఇచ్చారని, ఆటో అడ్డా యూనియన్ ప్రతినిధులు అభ్యంతరం చెబుతున్నందున పరిష్కరించాలని జన్ను భాస్కర్ విన్నవించారు. గ్రీవెన్స్ సెల్లో 50 వినతులు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి 23, ఇంజినీరింగ్ 15, ప్రజారోగ్య విభాగానికి 3, పన్నుల విభాగానికి 10 వినతులు వచ్చాయి. ఇన్చార్జి అదనపు కమిషనర్ కార్యదర్శి విజయలక్ష్మి, సిటీప్లానర్ వెంకన్న, పన్నుల అధికారి శాంతికుమార్, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, ఈఈలు, డీఈ, ఏసీపీలు పాల్గొన్నారు.