జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కోసం అర్జీలు వెల్లువలా వచ్చాయి. అర్హత వయసును ప్రభుత్వం 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించిన నేపథ్యంలో అర్హుల నుంచి రెండు విడుతల్లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో తొలి విడుత అక్టోబర్ 31 వరకు జిల్లాలోని 13 మండలాల నుంచి 16,237 మంది అర్జీ పెట్టుకున్నారు. మరో అవకాశం ఇవ్వాలని వినతులు వచ్చిన క్రమంలో రెండో విడుత అక్టోబర్ 11 నుంచి 31 వరకు గడువు ఇచ్చి ఎలాంటి ఫీజు చెల్లించకుండానే మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో అర్జీలు మరిన్ని పెరుగగా మొత్తం రెండు విడుతల్లో కలిపి 20,036 దరఖాస్తులు వచ్చాయి. వీటిని త్వరలో అధికారులు పరిశీలించి మంజూరు కోసం ప్రభుత్వానికి పంపనున్నారు.
వరంగల్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆసరా పథకం నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం జిల్లాలో 20,036 మంది దరఖాస్తు చేశారు. స్వీకరణ గడువు ముగిసినందున అక్టోబర్ 31 వరకు అందిన దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును ప్రభుత్వం ఇటీవల 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్‌కు అర్హత ఉన్న వారి నుంచి రెండు విడుతల్లో దరఖాస్తులు స్వీకరించింది. ఆసరా పథకం నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం అర్హులైన వారు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలో తొలి విడుత గత ఆగస్టు 31వ తేదీ వరకు వయసు 57 ఏండ్లు నిండిన అర్హులు పింఛన్ కోసం మీసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తులు పంపారు.
తొలివిడుత జిల్లాలోని 13 మండలాల నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం 16,237 దరఖాస్తులు అందినట్లు సెప్టెంబర్ మొదటి వారంలో అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్న క్రమంలో వయసు 57 ఏండ్లు నిండిన అర్హులు ఇంకా మిగిలి ఉన్నందున దరఖాస్తులకు మరోసారి అవకావం ఇవ్వాలని ప్రభుత్వానికి వినతులందాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రెండో విడుత గత అక్టోబర్ 11 నుంచి 31వ తేదీ వరకు ఆసరా పథకం నుంచి వృద్ధాప్య పెన్షన్ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో వయసు 57 ఏండ్లు నిండిన అర్హులు గత అక్టోబర్ 31లోపు మీసేవ కేంద్రాల ద్వారా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేశారు. నేరుగా హైదరాబాద్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయానికి చేరిన ఈ దరఖాస్తుల్లో జిల్లా నుంచి వచ్చినవి 20,036 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు సమాచారం అందింది. వీటిలో వరంగల్, ఖిలావరంగల్ సహా జిల్లాలోని 13 మండలాల వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వృద్ధాప్య పింఛన్‌కు అర్హతలు
ప్రస్తుతం జిల్లాలో ఆసరా పథకం నుంచి 62,981 మంది పింఛన్ పొందుతున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు 23,584 మంది ఉన్నారు. వితంతువులు 24,293, దివ్యాంగులు 9,626, గీత కార్మికులు 2,360, చేనేత కార్మికులు 613, బీడి కార్మికులు 636, ఒంటరి మహిళలు 1,869 మంది నెలనెల ఆసరా పథకం నుంచి పెన్షన్ పొందుతున్నారు. 62,981 మందికి ప్రభుత్వం గత నెలలో రూ.14,55,60,560 పింఛన్ అందజేసింది. ఆసరా పథకం నుంచి వృద్ధాప్య పింఛన్ ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం నెలనెల రూ.2,016 ఇస్తుంది. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ గత ఆగస్టు 4న ప్రభుత్వం ఉత్తర్వులు విడదల చేసింది. ఆసరా పథకం నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం అర్హతలను పేర్కొంది. ఈ మేరకు పింఛన్ దరఖాస్తుదారులకు వయసు 57 ఏండ్లు నిండి 7.5 ఎకరాలు మెట్ట భూమి, 3 ఎకరాల మాగాణి లోపు ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, నగరాల్లో రూ.2 లక్షలకు మించి ఉం డొద్దు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా ఆసరా పెన్షన్‌కు అనర్హులు. సొంత వాహనాలు అంటే ఫోర్ వీలర్స్ అంతకంటే ఎక్కువ వెహికిల్స్ కలిగి ఉన్నవారు పింఛన్‌కు అర్హులు కాదు. ఓటర్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాలు, బర్త్, స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా దరఖాస్తుదారుల వయస్సును అధికారులు నిర్ధారిస్తారు. తెల్లకార్డు ఉన్నవారు మాత్రమే పింఛన్‌కు అర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు ఆసరా పథకానికి అనర్హులు. దరఖాస్తుదారుల సంతానం ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులై ఉండొద్దు. అర్హతలు కలిగిన వారు తమ ఫొటో, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ పుస్తకం జిరాక్స్ కాపీ, ఇతర పత్రాలను దరఖాస్తు వెంట జత చేశారు. ఆసరా పథకం నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం అర్హులు తమ దరఖాస్తులను ఎలాంటి రుసుం చెల్లించకుండా మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి పంపారు.
పరిశీలనకు సన్నద్ధం
మీసేవ, ఈసేవ ద్వారా అందిన దరఖాస్తులను హైదరాబాద్ నుంచి జిల్లాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చేరగానే వీటిని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు పంపేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో మండలాల్లో ఎంపీడీవోలు, వరంగల్ సహా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో అధికారులు పరిశీలిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారి దరఖాస్తులను వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం ప్రభుత్వానికి పంపిస్తారు. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది.