వరంగల్, నవంబర్ 13: చారిత్రక నగరికి ఔటర్ రింగ్‌రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు మణిహారం కానున్నాయి. నగరాభివృద్ధికి బాటలు వేయనున్నాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడడంతో అంతర్జాతీయ కంపెనీలు నగరం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానుండడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారితో అనుసంధానం చేసి ఔటర్ రింగ్‌రోడ్డును సంపూర్ణం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన విషయం తెలిసిందే. మున్సిపల్ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలోని రవాణా వసతులు, అభివృద్ధిపై నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, గ్రేటర్ వరంగల్ అధికారులతో ఇటీవల సమీక్షించారు. ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్ల భూ సేకరణ, నిర్మాణంలో వస్తున్న అడ్డంకులపై ఆయన ఆరా తీశారు. అవాంతరాల తొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ అధికారులకు మార్గదర్శనం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టడంతో త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగి రింగ్ రోడ్ల నిర్మాణాలకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అభివృద్ధికి బాటలు
ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణాలకు వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎడ్యుకేషనల్ హబ్‌గా వెలుగొందుతున్నది. ఈ నేపథ్యంలో రింగ్‌రోడ్ల నిర్మాణంతో నగరం అంతర్జాతీయ మార్కెట్‌కు విస్తరించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఓఆర్ఆర్, ఇన్నర్, రేడియల్ రోడ్లపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రేటర్ అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఓఆర్ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. దీంతో అనేక కుటుంబాలు తరలిరానున్నాయి. తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధి కేవలం నగరానికే పరిమితమైంది. ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి శివారు గ్రామాలకు విస్తరించనుంది. ఓఆర్ఆర్తో రవాణా వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా అనేక రాష్ర్టాలకు నగరం అనుసంధానం కానుంది. ఓఆర్ఆర్కు అనుసంధానంగా ఇన్నర్ రింగ్ నిర్మిస్తే రవాణా వ్యవస్థ మరింత సులభం కానుంది. ఇప్పటికే రైల్వేపరంగా ఉత్తర, దక్షిణ భారతానికి జంక్షన్‌గా ఉంది. ఈ తరుణంలో ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లతో రోడ్డు మార్గం అనుసంధానం మరింత పెరుగనుంది. నగరం చుట్టూ నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుతో శివారు గ్రామాలు పట్టణాలుగా మారనున్నాయి. చారిత్రక నగరి చుట్టూ నిర్మించే ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లు శివారు గ్రామాల దశ మార్చనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ రేడియల్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లను కలుపుతూ అనేక అంతర్గత రోడ్లను నిర్మించనున్నారు.
విస్తరించనున్న మార్కెట్
రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరం చుట్టూ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ మణిహారాలుగా మారనుండడంతో కొత్త మార్కెట్ రూపాంతరం చెందనుంది. ప్రస్తుత నగర మార్కెట్ వ్యవస్థ మరింత విస్తరించనుంది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ తర్వాత వరంగల్ వైపు వస్తున్న అంతర్జాతీయ కంపెనీలు రింగ్ రోడ్లతో మార్కెట్ విస్తరణపై మరింత దృష్టి పెట్టనున్నాయి. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న గ్రేటర్ ఓఆర్ఆర్తో అన్ని రకాల మార్కెట్ వ్యవస్థ బలోపేతం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రింగ్ రోడ్ల చుట్టూ కమర్షియల్ జోన్‌ను నిర్ణయించారు. విల్లాలు, అపార్ట్మెంట్లు, ఎంటైర్టైన్మెంట్ పార్కులు, కార్పొరేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు వచ్చేలా మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చారు. వేలాది మందికి ఉపాధి కల్పించే టెక్స్టైల్ పార్కు పనులు వేగంగా సాగుతున్న తరుణంలో నగరం అంతర్జాతీయ మార్కెట్ చిత్రపటంలో నిలువనుంది. ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ రోడ్ల నిర్మాణం కల సాకారం కానుండడంతో వాణిజ్య పరంగా వరంగల్, హనుమకొండ నగరాలు అభివృద్ధి చెందనున్నాయి.